వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఓపీ సాఫ్ట్ లాంచ్ వాయిదా..కారణమిదే!
వరంగల్ లో ఈరోజు దసరా సందర్భంగా ప్రారంభం కావాల్సిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఓపీ సాఫ్ట్ లాంచ్ వాయిదా పడింది. వరంగల్‌లో నిర్మాణం దాదాపు పూర్తయిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఓపీ సేవల సాఫ్ట్ లాంచ్ నేడు చేస్తామని ఇటీవల ఆస్పత్రిని సందర్శించిన వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు., అవసరమైన ఏర్పాట్లు పూర్తి కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పాత ఎంజీఎం ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో, గతంలో సెంట్రల్ జైలు ఉన్న ప్రాంతంలో ప్రభుత్వం అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తోంది. నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఓపీ సేవలు ప్రారంభించేందుకు కావాల్సిన మౌలిక వసతులు, వైద్య సిబ్బంది ఏర్పాట్లు, పరికరాల సన్నాహాలు పూర్తి కాకపోవడంతో సాఫ్ట్ లాంచ్‌ను వాయిదా వేశారు.

అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. ఈ వాయిదాతో స్థానికుల్లో నిరాశ నెలకొంది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయని, పూర్తిస్థాయిలో నవంబర్ చివరి నాటికి లేదా డిసెంబర్ 15 నాటికి ఆస్పత్రి అందుబాటులోకి వస్తుందని చెబుతోంది.
ఇటీవల అక్టోబర్ 15న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆస్పత్రి నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. వివిధ విభాగాలు, రోగులకు అందించనున్న సదుపాయాలు, మౌలిక వసతులను అధికారులు, వైద్యులతో చర్చించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొండి గోడలతో వదిలేసిందని, తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తోందని ఆయన చెప్పారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వైద్య రంగానికి నిధుల కొరత రాకుండా చూస్తున్నామని తెలిపారు.
ఈ కొత్త ఆస్పత్రి అందుబాటులోకి వస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. ఆధునిక పరికరాలు, సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఉండటం వల్ల క్లిష్టమైన చికిత్సలు కూడా స్థానికంగానే అందుతాయి. ప్రస్తుతం పాత ఎంజీఎం ఆస్పత్రిలో రోగుల సంఖ్య ఎక్కువగా ఉండి, సేవలు సరిగా అందటం లేదని స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు.
కొత్త ఆస్పత్రి ప్రారంభమైతే ఈ సమస్యలు తీరతాయని ఆశిస్తున్నారు. అధికారులు త్వరలోనే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి కొత్త తేదీని ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు. వరంగల్ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా ఈ ఆస్పత్రి కీలక పాత్ర పోషించనుంది.












Click it and Unblock the Notifications
