Air India విమానానికి బర్డ్ హిట్ కలకలం.. విశాఖ నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం
విశాఖపట్నం నుంచి బెంగళూరు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి గాల్లో ఉండగా ఊహించని పరిణామం ఎదురైంది. విమానం ప్రయాణిస్తుండగా ఒక పక్షి ఢీకొనడంతో కలకలం రేగింది. అయితే పైలట్ల అప్రమత్తత, సాంప్రదాయ భద్రతా ప్రమాణాల కారణంగా విమానం బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 148 మంది ప్రయాణికులు, సిబ్బంది అంతా క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ల్యాండింగ్ తర్వాత విమానాన్ని పార్కింగ్ స్టాండ్‌కు తరలించి, ఇంజన్లు, బాడీని ఇంజనీరింగ్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేశాయి.

ఇటీవల కాలంలో విమానయాన రంగంలో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఫ్రాంక్ఫర్ట్ నుంచి దిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో హైజాక్ భయం తలెత్తడంతో జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. విమానం నుంచి అనుమానాస్పద సంకేతాలు వెలువడటంతో భద్రతా ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. ఏరోడ్రోమ్ కమిటీ పరిస్థితిని సమీక్షించి, ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించిన తర్వాతే ఆ విమానాన్ని తిరిగి గమ్యస్థానానికి వెళ్లేందుకు అనుమతించారు.
మరో ఘటనలో, దిల్లీ నుంచి చెన్నై బయలుదేరిన ఇండిగో విమానంలో ఊహించని విధంగా ప్రమాదం సంభవించింది. ప్రయాణికుడి దగ్గర ఉన్న పవర్ బ్యాంక్ అకస్మాత్తుగా మంటలు అంటుకుని క్యాబిన్‌లో పొగలు కమ్ముకున్నాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని పైలట్లు వెంటనే శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాన్ని అత్యవసరంగా మళ్లించి దించారు. వరుస ఘటనల నేపథ్యంలో విమాన ప్రయాణాల్లో భద్రతా చర్యలను మరింత కఠినతరం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.














Click it and Unblock the Notifications
