మోదీ ఫొటో వాటి మీద తప్పక పెడతాం.!నిర్మలా సీతారామన్ కు ఎమ్మెల్సీ కవిత గట్టి కౌంటర్.!
నిజామాబాద్/హైదరాబాద్: ఒకవైపు తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాల అమలులో దేశంలో అగ్రస్థానంలో ఉండగా, మరోవైపు పేదలకు ఇస్తున్న ఉచితాలను ఆపాలంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ప్రధాని మోదీ ఫొటో గ్యాస్ సిలిండర్, యూరియా బస్తాలపై తప్పక పెడతామని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దీటుగా కౌంటర్ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఆసరా ఫించన్‌ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా పెన్షన్.. బీజేపికి తెలంగాణ గిట్టదన్న ఎమ్మెల్సీ కవిత
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సితారామన్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటనకు వచ్చి రేషన్ షాపులలో ప్రధాని మోదీ ఫోటో ఎందుకు లేదని అడుగుతున్నారని, ఎక్కడైనా రేషన్ షాపులో ప్రధాని ఫొటోలు పెడతారా? అని ప్రశ్నించారు. అంతే కాకుండా కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చి పంచాయితీ పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్‌ను ఆగం పట్టించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని ఘాటుగా ఆరోపించారు. 57 సంవత్సరాల పైబడిన వాళ్లకు పెన్షన్ ఇవ్వాలని సీఎం చంద్రశేఖర్ రావు నిర్ణయించారని అన్నారు.

సంక్షేమ పథకాలు ఆపాలంటున్న ప్రధాని మోదీ.. తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పాలన్న కేసీఆర్ తనయ
భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయని అందులో కేవలం తెలంగాణలోనే ఇంత పెద్ద మొత్తంలో పించన్‌లు ఇస్తున్నారని, పక్కనున్న మహారాష్ట్రలో ఎంత ఇస్తున్నారో పక్కనే ఉన్న మహారాష్ట్రతో అనుబంధం ఉన్న వారికి తెలుసన్నారు ఎమ్మెల్సీ కవిత. పేదలకు, వృద్దులకు, బీడి కార్మికులకు, మానసిక పరిస్థితి బాగా లేని వాళ్లు, ఇలా అనేక వర్గాలకు పెన్షన్ ఇస్తున్నామని, రాష్ట్రం రాకముందు 200 రూపాయలు పెన్షన్ ఉంటే, రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1000 రూపాయలతో పెన్షన్ ఇచ్చుడు మొదలుపెట్టుకున్నామని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు.

సంక్షేమ సారథి సీఎం కేసీఆర్...సంక్షేమ పథకాల వ్యతిరేకి ప్రధాని మోదీ అన్న ఎమ్మెల్సీ కవిత
వయసు పైబడిన వాళ్లు, పేద వాళ్లు ఆత్మగౌరవంతో బతకాలనే సీఎం చంద్రశేఖర్ రావు పెన్షన్ ఇస్తున్నారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఒక ఇంట్లో ఒక కాలు లేని బిడ్డ ఉంటే, ఆ ఇంటికి ఎంత బారంగా ఉంటదో అర్థం చేసుకునే గుండె ఉన్న వ్యక్తి చంద్రశేఖర్ రావు కాబట్టి, ఆ గుండె నిరంతరం తెలంగాణ బిడ్డల కోసం కొట్టుకుంటది కాబట్టి.. పెద్ద మొత్తంలో పెన్షన్ ఇస్తున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. పేద వాళ్లకు పెన్షన్ ఇస్తే, వాళ్ల ఆశీర్వాదంతో తెలంగాణ, బంగారు తెలంగాణ అయితది, సంపద సృష్టించే తెలంగాణ అవుతది,దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం అవుతదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

సంక్షేమ పథకాలు ఆపాలంటున్న ప్రధాని మోదీ. బీజేపి తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలన్న కవిత
ప్రధాని మోదీ బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి పోయిన వాళ్ల మిత్రులకు పది లక్షల కోట్ల రూపాయలు పంచుతున్నడు కానీ పేద వాళ్లకు ఉచితాలు ఇస్తే తప్పంటున్నరని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. పేదవాళ్లకు రేషన్, పెన్షన్, షాదీ ముబారక్, స్కాలర్ షిప్ లాంటివి ఇవ్వద్దని మోదీ చెబుతున్నారు.. ఉచిత పథకాలు ఇచ్చి ప్రభుత్వాలు ప్రజలను చెడగొడుతున్నయని మోదీ అంటున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం కరోనా వచ్చినా, పెన్షన్ ఇచ్చుడు ఆపలేదు. రేషన్, కరెంటు, వ్యవసాయం ఏదీ ఆపలేదని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు.కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఉచిత పథకాలపై చర్చ మొదలు పెట్టిందని, యువకులు, మహిళలు వాట్సాప్ లో బీజేపీ చేసే తప్పుడు ప్రచారాలపై జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.












Click it and Unblock the Notifications