రైతులకు గుడ్‌న్యూస్: కుటుంబ సర్వే తర్వాత స్మార్ట్ కార్డులు
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. త్వరలోనే రైతు భరోసా మొదటి విడత నిధులు జమచేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లో రైతుల కోసం రూ.72 వేల కోట్ల నిధులు వెచ్చించామని చెప్పారు.
శుక్రవారం నిర్మల్ జిల్లాలోని భైంసాలో మహారాష్ట్ర ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు ఇస్తూ పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. పదేళ్లలో గత ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని బీఆర్ఎస్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.గత ప్రభుత్వం పదేళ్లలో కొత్తరేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వలేదని మండిపడ్డారు.

తమ ప్రభుత్వం ప్రతిపక్షాల అభిప్రాయాలను స్వీకరించి అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకెళ్తోందన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఐదేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే తర్వాత బహుళ ప్రయోజనాలు అందించే స్మార్ట్‌కార్డులు అందిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ మేరకు ప్రతి ఒక్కరు కులగణన సర్వేకు సహకరించాలని కోరారు.
సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఒక్కసారి మాట ఇస్తే మడమతిప్పదన్నారు. రాహుల్ గాంధీ దేశ ప్రధాని కాగానే తెలంగాణను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామన్నారు. మరోవైపు, వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటనలో ఎంతటివారున్నా.. వదిలే ప్రసక్తే లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అంతకముందు భైంసాలోని విశ్రాంతి భవనంలో స్థానిక సమస్యలపై అధికారులతో సమీక్షించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.












Click it and Unblock the Notifications