భట్టి విక్రమార్కకు ప్రమోషన్ వస్తే బాగుంటుంది: సభలో నవ్వులు పూయించిన కేసీఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్కపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రశంసాపూర్వక వ్యాఖ్యలుచేశారు. మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని భట్టి విక్రమార్క ప్రశంసించడాన్నా సీఎం కేసీఆర్ అభినందించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తున్న విధానంపై భట్టి మాట్లాడిన విధానం చూస్తే ఆయనకు ప్రమోషన్ వస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. అంటే ఆయన ఎంపీ కావాలని కోరుకుంటున్నట్లు కేసీఆర్ చెప్పారు.

భట్టి విక్రమార్కకు దయ కలిగిందంటూ కేసీఆర్ కామెంట్స్
ఈ సందర్భంగా అసెంబ్లీలో నవ్వులు పూశాయి. భట్టి విక్రమార్క కూడా చిరునవ్వు నవ్వారు. దీంతో రోజూ వాడీవేడిగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు సరదాగా ముగిశాయి. కేసీఆర్ మాట్లాడుతూ.. భట్టి విక్రమార్కకు నా రిక్వెస్టు ఏందంటే.. మొన్న ఏదో ఒక మంచి మాట వారు మాట్లాడినట్లు పేపర్లలో చూశా.. మన ఊరు-మన బండి మంచి కార్యక్రమం అని అన్నారు. నేను ప్రతిసారి అంటూ ఉంటా. భట్టి విక్రమార్క ప్రేమకు మేము నోచుకోలేదు. ఒక్కటైనా మంచి మాట చెప్పరని అంటూ ఉంటా. ఈసారి వారికి ఎందుకు దయ కలిగింది. మంచి మాట ఒకటి చెప్పారు అని కేసీఆర్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.

భట్టి విక్రమార్కకు ఎంపీగా ప్రమోషన్ ఇవ్వాలంటూ కేసీఆర్ వ్యాఖ్యలు
అంతేగాక, దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు ఎట్లా నాశనం చేయబడుతున్నాయో భట్టి చాలా గట్టిగా చెప్పారని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా మా వైపు కొందరు సభ్యులు అంటున్నారు.. భట్టి విక్రమార్క పార్లమెంటులో ఉంటే బాగుంటుందని. అందరం కలిసి మన రాష్ట్రం పక్షాన పార్లమెంటుకు పంపాలని మాట్లాడుతున్నారు. ప్రమోషన్ అధ్యక్షా.. డిమోషన్ ఏమీ లేదిక్కడ అంత గట్టిగా వారు మాట్లాడుతుంటే.. ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. సభ్యులకు ఇమ్మిడియట్ అభిప్రాయం ఏమొచ్చిందంటే.. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద చూపాల్సిన కపం మామీద చూపిస్తే ఎలా. మేం కాదు కదా చేసేదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
Recommended Video

ప్రభుత్వ సంస్థలను కాపాడుతున్నామంటూ కేసీఆర్
మన దగ్గర ఉన్న ప్రైవేటు సంస్థలు ఎంతో కొంత కాపాడుతున్నా.. ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అద్భుతంగా కాపాడుతున్నాం. ఆర్టీసీ పరిరక్షణ కావొచ్చు. సింగరేణి పరిరక్షణ కావొచ్చు మన పరిధిలో ఉన్న మేరకు కాపాడుకుంటూ వస్తున్నామని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇటీవల కేంద్రంపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు కేసీఆర్. కేంద్రం విధానాలు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications