వెదర్ అలర్ట్: రెండ్రోజులపాటు ఈ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాలులు
హైదరాబాద్: రుతుపవనాలు ఆలస్యమవుతుండటంతో తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. మరికొన్ని రోజులపాటు ఈ ఎండలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. సోమ, మంగళవారాల్లోనూ పరిస్థితి తీవ్రంగానే ఉంటుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ రెండు రోజులపాటు తీవ్ర వడగాలలు వీస్తాయని హెచ్చరించింది.
ప్రధానంగా సోమవారం గరిష్ట ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్‌ను తాకే అవకాశం ఉందంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో ప్రజలు ీ రెండు రోజులు ఎండలో తిరగకపోవడం మంచిదని సూచించింది. ఇంటి నుంచి బయటకు వెళ్తే తప్పనిసరిగా తలకు టవల్ లాంటి వస్త్రం చుట్టుకోవాలని, దాహం అనిపించకపోయినా నీళ్లు తాగాలి. డీహైడ్రేషన్ కు గురికాకుండా చూసుకోవాలని వాతావరణ శాఖ సూచనలు చేసింది. మరోవైపు, సోమవారం హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఆదిలాబాద్, కుమురంభీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. మంగళవారం 40-43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. కాగా, రాష్ట్రంలో ఆదివారం 16 జిల్లాల్లోని 39 మండలాల్లో వడగాలు వీచాయి. వీటిలో 24 మండలాల్లో తీవ్రమైన వడగాలులు నమోదు కావడం గమనార్హం.

సాధారణ ఉష్ణోగ్రత కన్నా 4.5 డిగ్రీలపైనా నమోదైతే వడగాలులుగా, 6.5 డిగ్రీలపైగా నమోదైతే తీవ్రమైన వడగాలులుగా వాతావరణ శాఖ ప్రకటించింది. అలాంటి చోట అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆరోగ్యకరమైన సమస్యలు తలెత్తుతాయని సూచిస్తోంది. ఈ మేరకు పెద్దపల్లి జిల్లాలో 6 మండలాలు, భద్రాద్రి, కుమురంభీం అసిఫాబాద్ జిల్లాలో 3, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో 2 చొప్పున, యాదాద్రి భువనగిరి, మంచిర్యాల, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల్లో ఒక్కో మండలాల్లో తీవ్రమైన వడగాలులు నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో 44.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.












Click it and Unblock the Notifications