తెలంగాణకు ఎండల నుంచి ఉపశమనం: తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
హైదరాబాద్: మార్చి నుంచే మొదలైన అధిక ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ నెలలోనూ కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఎండలు, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే, తాజాగా, ఎండవేడిమి నుంచి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది.
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయని.. ఎల్లుండి అంటే గురువారం మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుందని, ఈ సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఏపీలోనూ రెండ్రోజులపాటు వర్షాలు
రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ గాలుల ఫలితంగా రాష్ట్రంలో రాగల రెండు రోజులపాటు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపింది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రలో సోమవారం నుంచి రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు, రాయలసీమలోనూ మంగళ, బుధవారాల్లో వాతావరణం పొడిగానే ఉండనుందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. కాగా, మంగళవారం పలు ప్రాంతాల్లో చల్లని వాతావరణం ఏర్పడింది.


Click it and Unblock the Notifications