హైదరాబాద్‌లో అతి భారీ వర్షాలు: రెడ్ అలర్ట్ జారీ, బయటికి రావొద్దంటూ జీహెచ్ఎంసీ వార్నింగ్
హైదరాబాద్: నగరంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి 8గంటల వరకు భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉదయం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిస్తూనే ఉంది. మరో 8 గంటలపాటు ఈ వర్షం విరామం లేకుండా కొనసాగనుంది.
ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు రెడ్ అలర్ట్ ను జారీ చేశారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ అధికారులు కోరారు. అవసరమైతే తప్ప బయటికి రాకూడదని స్పష్టం చేశారు.

తెలంగాణ పొరుగున ఉన్న ఛత్తీస్‌గడ్‌పై 2.1 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం, భూమికి 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలుల్లో అస్థిరత ఏర్పడింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వివరించింది. రుతుపవనాలు... దట్టంగా అలుముకున్న క్యూములో నింబస్ మేఘాలు చురుగ్గా కదులుతున్నాయి.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్‌తో పాటుగా 16 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ..
అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. అయితే ప్రస్తుతం మూసీ పరీవాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. అత్యవసరం ఏర్పడితే సహాయం కోసం 040 - 2955 5500 నంబర్‌ను సంప్రదించాలనిహైదరాబాద్ నగర ప్రజలకు సూచించారు.
ఏపీ, తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు దక్షిణ భారతదేశంతోపాటు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది.
కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రాగల మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
సెప్టెంబర్ 6-7 తేదీల్లో అల్పపీడన ప్రాంతం లేదా దాని అవశేష తుఫాను ప్రసరణ పశ్చిమ-వాయువ్య దిశ ప్రభావంతో దక్షిణ ఒడిశా, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో చాలా వరకు విస్తారమైన భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉత్తర మరాఠ్వాడ, ఉత్తర మధ్య మహారాష్ట్ర, ఉత్తర కొంకణ్, గుజరాత్ ప్రాంతం సెప్టెంబర్ 7-9 మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 7-8 మధ్య ఉత్తర కొంకణ్‌లో, సెప్టెంబర్ 8న మధ్య మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాలలో, సెప్టెంబర్ 7 న తెలంగాణాలో కూడా భారీ భారీ వర్షపాతాలు నమోదుకావచ్చని తెలిపింది. సెప్టెంబర్ 7-9 తేదీల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర పంజాబ్, జమ్మూ ప్రాంతం, తూర్పు రాజస్థాన్‌లలో భారీ వర్షాలు, వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలలో విస్తారంగా వానలతో వర్షపాతం పెరిగే అవకాశం ఉంది.
ఆగస్టులో వర్షపాతం తక్కువగా నమోదైన తరువాత..సెప్టెంబర్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతాన్ని అంచనా వేసింది భారత వాతావరణ శాఖ. ఆగస్టు 31 వరకు వర్షపాతం లోటు తొమ్మిది శాతం ఉండగా, సెప్టెంబర్ 5 వరకు లోటు తొమ్మిది శాతానికి తగ్గింది. సెప్టెంబర్‌లో తన సూచనను జారీ చేస్తున్నప్పుడు.. ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృతుంజయ్ మొహపాత్రా మాట్లాడుతూ.. ఆగస్టులో నమోదైన లోటు ప్రస్తుత నెలలో అధిక వర్షపాతంతో భర్తీ చేయబడుతుందని చెప్పారు. భారతా వాతావరణ శాఖ అతి భారీ వర్షాలను అంచనా వేసిన తరువాత గోవా అధికారులు అప్రమత్తమయ్యారు. రాబోయే రెండు రోజుల్లో కోస్తా రాష్ట్రంలో చాలా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసిన ఒక రోజు తర్వాత ఆదివారం గోవా పరిపాలన విభాగం అప్రమత్తంగా ఉందని అధికారులు తెలిపారు.
గోవా రాజధాని పనాజీ, రాష్ట్రంలోని ఇతర నగరాలలో ఉదయం నుంచీ ఆకాశం మేఘావృతమై ఉందని అధికారులు తెలిపారు. ఉత్తర గోవా జిల్లా పరిపాలన విభాగం నుంచి ఒక సీనియర్ అధికారి కంట్రోల్ రూమ్‌లు యాక్టివ్ చేయబడ్డాయని తెలిపారు. ప్రజలు తమ ప్రాంతాలలో వరదలు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
గత నెల అనుభవం తర్వాత, అనేక ప్రదేశాలు వరదలు సంభవించినప్పుడు (భారీ వర్షాల కారణంగా), తాము అప్రమత్తంగా ఉన్నామని అధికారి చెప్పారు. రానున్న 48 గంటల్లో దక్షిణ కొంకణ్, గోవాలో రుతుపవనాల కార్యకలాపాలు బలపడవచ్చునని, ఉత్తర వాతావరణంలో, మధ్య బంగాళాఖాతం చుట్టూ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. సెప్టెంబర్ 6, 7న గోవా జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల చాలా భారీ వర్షపాతం (24 గంటల్లో 11.5 సెంటీమీటర్లకు మించి) నమోదయ్యే అవకాశం ఉంది. గోవా జిల్లాల్లో సెప్టెంబర్ 4 నుంచి ఒక వారం పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. గోవా తీర ప్రాంతాల్లో ఉరుములుమెరుపులు, ఈదురుగాలులతో కూడి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇప్పటికే రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు.












Click it and Unblock the Notifications