weather: హైదరాబాద్ తోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకూ రెడ్ అలర్ట్, భారీ వర్షాలు
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరించింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ వానలు విస్తారంగా కురుస్తాయని పేర్కొంది. అంతేగాక, రెడ్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇప్పటికే కురిసిన వర్షాలకు చెరువులు నిండిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. అత్యధికంగా హన్మకొండ జిల్లా నడికుడ మండలంలో 38 సెం.మీ వర్షపాతం నమోదైంది. ప్రజలను అప్రమత్తంచేసి ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని జిల్లా అధికార యంత్రంగానికి సూచనలు చేసింది. వాగులు,చెరువులు, కుంటల వద్ద జాగ్రత్తలు పాటించాలని సూచించింది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి అధికారులను అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. వరంగల్ & హనుమకొండ కలెక్టరేట్లలో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. వరంగల్ 915452937, 1800 425 3424. హనుమకొండ లో 1800 425 1115 టోల్ ఫ్రీ నెంబర్లు.

అత్యధిక వర్షపాతాలు నమోదు
కాగా, అత్యధికంగా నడికుడలో 14.5, సంగెంలో 14.4 సెం.మీ, బయ్యారంలో 12.3, చింతగట్టులో 10.8, ఎల్కతుర్తిలో 10, ధర్మసాగర్‌లో 10.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. పలు కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరాయి. దీంతో కొందరు ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాల్లోని బంధువుల వద్దకు వెళ్లిపోతున్నారు. మరోవైపు ములుగు జిల్లా వాజేడు మండలంలో రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు బొగత జలపాతం మరింత సుందరంగా కనిపిస్తోంది. హైదరాబాద్, వరంగల్ తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజులపాటు భారీ వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

హైదరాబాద్‌లో కొనసాగుతున్న రెడ్ అలర్ట్
హైదరాబాద్‌లో మంగళ, బుధ, గురువారాల్లో మూడు రోజులు రెడ్ అలర్ట్ కొనసాగనుందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రుతుపవనాలు... దట్టంగా అలుముకున్న క్యూములో నింబస్ మేఘాలు చురుగ్గా కదులుతున్నాయి. అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాబట్టి ఆ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అందుకే గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా 16 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది.కాగా, సోమవారం కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వరద ప్రవాహం కొనసాగింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. అయితే ప్రస్తుతం మూసీ పరీవాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు రెడ్ అలర్ట్ ను జారీ చేశారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ అధికారులు కోరారు. అవసరమైతే తప్ప బయటికి రాకూడదని స్పష్టం చేశారు. అత్యవసరం ఏర్పడితే సహాయం కోసం 040 - 2955 5500 నంబర్‌ను సంప్రదించాలనిహైదరాబాద్ నగర ప్రజలకు సూచించారు.












Click it and Unblock the Notifications