వెదర్ అప్‌డేట్: తెలంగాణలో రెండ్రోజులపాటు భారీ వర్షాలు, ఏపీలోనూ
హైదరాబాద్: తెలగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులపాటు అంటే జులై 17, 18, 19 తేదీల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ఆదివారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా, హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది.
ఉత్తర కోస్తాంధ్ర మీద ఉన్న ఆవర్తనం బలహీనపడిందని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా-గ్యాంగ్‌టక్ పశ్చిమబెంగాల్ తీరాల్లో సగటున సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఆవర్ణం ఏర్పడి ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశగా వంగి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఆవర్తనం రానున్న రెండు మూడు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఉన్న ఉత్తర ఒడిశా, దాని పరిసరాల్లోని గ్యాంగ్‌టక్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మీదుగా వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

మరో ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతంలో జులై 18న ఏర్పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో పశ్చిమ దిశ వైపు నుంచి తెలంగాణ వైపునకు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో అనేక చోట్ల, దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల.. రాయలసీమలోని ఒకటి రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
సోమవారం ఉత్తర, దక్షిణ కోస్తాల్లో కొన్ని చోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలకు ఆస్కారం ఉందని తెలిపింది. జులై 18 నాటికి వాయువ్య బంగాళాఖాతంలోనే మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, అదే రోజు నుంచి రాష్ట్రంలో వర్షాలు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications