'సొంతకుంపటి ఆలోచనలో రేవంత్ ?' : టీడీపీని ఓ పావులా వాడుకుంటున్నారా?

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్ : విభజన జరగకపోతే తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఎలా ఉండేదో గానీ..! విభజన తర్వాత మాత్రం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నట్లుగా తయారైంది టీడీపీ పరిస్థితి. అసలు విపక్షాల ప్రస్తావనే లేకుండా.. తెలంగాణలో రాజకీయమంటే టీఆర్ఎస్ కేంద్రీకృతంగానే మారిందనడం అతియోశక్తి కాదేమో..!

ఒక్క టీఆర్ఎస్ తో తప్ప రాజకీయంగా మనుగడ సాధించడం అసాధ్యం అన్న ఆలోచనకు వచ్చిన చాలామంది నేతలు.. భవిష్యత్తు రాజకీయాన్ని వెతుక్కుంటూ టీఆర్ఎస్ కండువాలు కప్పేసుకున్నారు. కేసీఆర్ ను ఎదుర్కోవడం కాదు కదా..! ఆయన రాజకీయ చతురతతో పోల్చదగిన ఒక్క నేత కూడా ప్రతిపక్షాల్లో లేకపోవడం రాజకీయ వలసలకు మరింత కారణమైంది.

ఇటు టీడీపీ పరిస్థితి మరీ దారుణం.. విభజనతోనే చిత్తయిన పార్టీని, ఓటుకు నోటు కేసు మరింత దెబ్బ తీసింది. ఆ తర్వాత గ్రేటర్ ఎన్నికల్లోను పార్టీ ఉసూరుమనిపించింది. దీంతో అప్పటివరకు అంతో ఇంతో తెలంగాణ పాలిటిక్స్ పై ఫోకస్ చేసిన అధినేత చంద్రబాబు ఆ తర్వాత తన మకాంను బెజవాడకు మార్చి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో.. పార్టీని ముందుండి నడిపించే నాయకత్వం కరువైంది.

Whats going on in T-TDP.. why the seniors are unhappy about Revanth

ఈ సమయంలో సీనియర్ల మధ్య విభేదాలు.. ముఖ్యంగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ తో పొసగని కారణంగా ఎర్రబెల్లి లాంటి నేతలు కూడా కారెక్కేశారు. టీఆర్ఎస్ లోకి వెళ్లలేని ఓ అనివార్య స్థితి రేవంత్ లాంటి నేతలను వెంటాడుతుండడంతో రాజకీయ ఉనికి కోసం ఒంటరి పాట్లు తప్పట్లేదు. అయితే పార్టీలో సీనియర్లను, అధినేత మార్గదర్శకాలను సైతం పక్కనబెట్టి రేవంత్ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు సొంత పార్టీలోనే ఆయన పట్ల అసంతృప్తిని పెంచేవిగా మారాయి.

ముఖ్యంగా పార్టీ కార్యచరణకు సంబంధించి.. మిగతా నేతలకు సమాచారమివ్వకుండా రేవంత్ ఒక్కరే తన సొంత కార్యక్రమాలు రూపొందించుకుంటారని అధినేత ముందే తమ అసంతృప్తిని వెల్లగక్కారు మోత్కుపల్లి లాంటి సీనియర్ నేతలు. నేతలందరు కలిసి కట్టుగా పనిచేయాలని.. కార్యచరణకు సంబంధించిన సమాచారం కోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని అప్పట్లో చంద్రబాబు హామి కూడా ఇచ్చారు.

అయితే అది ఎంత మేర ఆచరణకు నోచుకుందో తెలియదు గానీ..! రేవంత్ ఒంటెద్దు పోకడలకు బ్రేక్ పడలేదన్న ఆరోపణ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మల్లన్న సాగర్ వివాదంలో పార్టీతో సంబంధం లేనట్లుగా రేవంత్ ఆందోళన చేపట్టడం.. దర్నా సందర్బంగా చంద్రబాబు ఫోటోలు గానీ, టీడీపీ ప్రస్తావన గానీ లేకపోవడంతో.. పార్టీని పక్కనబెట్టి సొంత ఇమేజ్ కోసం రేవంత్ పాకులాడుతున్నారన్న ఆరోపణలు మరింత ఎక్కువయ్యాయి.

సొంత కుంపటి పెడుతారా..?

టీడీపీతో తెలంగాణలో నెట్టుకు రావడం కష్టమేనన్న ఆలోచనకు రేవంత్ వచ్చారని.. అందుకే పార్టీ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని కాకుండా జనంలో తనకంటూ ఓ ప్రాచుర్యాన్ని, ఫాలోయింగ్ ను ఏర్పరుచుకోవాలనే తీరులో రేవంత్ వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇంకా బలంగా వినిపిస్తోన్న వాదన ఏంటంటే.. తన సామాజిక వర్గాన్ని ఏకం చేయడానికి టీడీపీని ఓ పావులా వాడుకుంటున్నారనే ఆరోపణ కూడా రేవంత్ పై ఉంది. పార్టీ వేదికగానే తన సామాజిక వర్గాన్ని పోగు చేసి సొంతకుంపటి కోసం ఆయన ప్లాన్ చేసుకుంటున్నారని.. అందుకే పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ మాటలను కూడా లెక్క చేయట్లేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఈ నేపథ్యంలోనే మిగతా నేతలంతా బెజవాడలో అధినేతతో సమావేశం అవడానికి వెళ్లినా.. ఎన్టీఆర్ భవన్ లో లోకేష్ సమీక్షలకు వెళ్లినా.. రేవంత్ మాత్రం వాటికి దూరంగా ఉంటున్నారనే ఆరోపణ ఉంది. ఏదేమైనా తెలంగాణలో ఏకఛత్రాధిపత్యంగా కొనసాగుతోన్న టీఆర్ఎస్ రాజకీయ శక్తిని నిలువరించడానికి.. అంతే స్థాయిలో ఓ బలమైన ప్రత్యమ్నాయాన్ని సృష్టించడం అంత తేలికైన పని కాదు. మరి రేవంత్ ఏ వ్యూహంతో బలమైన సామాజిక వర్గాన్ని తనవైపుకు తిప్పుకోబోతున్నారు..? దాన్ని టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మార్చడం ద్వారా రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తున్నారా..? లాంటి ప్రశ్నలన్ని ప్రస్తుతానికి ఊహాజనితాలే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Its an interesting buzz in TTDP politics that TTDP working president Revanth Reddy was trying to seperate from the party

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి