ఫీస్ రీఎంబర్స్ మెంట్స్, స్కాలర్ షిప్ లు ఎటుపోయినయ్.? ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్.!
హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ ల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేసారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్ధులంటే ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపని రేవంత్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. సర్కార్ నిర్లిప్తత కారణంగా విద్యార్థులు, విద్యాసంస్థల యాజమానులకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని, వెంటనే ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లు చెల్లించాలని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
స్కాలర్ షిప్ ల విషయంలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం..
ఫీజు రీయింబర్స్ మెంట్, విద్యార్థుల స్కాలర్ షిప్ ల విషయంలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా...ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ ల జాడేదంటూ కేటీఆర్ ప్రశ్నించారు. బోధనా ఫీజుల బకాయిలు రూ. 5900 కోట్లకు చేరుకున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఈ ఏడాది స్కాలర్ షిప్ ల దరఖాస్తులకు కూడా దిక్కులేని పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులు చదవులకు దూరం ..
ప్రభుత్వ వైఖరి కారణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులు చదవులకు దూరం కావాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులంటే ఈ ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపని కేటీఆర్ ప్రశ్నించారు. స్కాలర్ షిప్ లు రాక ఎంతో మంది పేద విద్యార్థులు చదువు వదిలేసి కూలీ పని చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహాల్లో మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా రాకపోవటంతో విద్యార్థులు చదువుకు దూరం కావాల్సి వస్తుందని చెప్పారు.
పెండింగ్ పెట్టటంతో విద్యార్థులకు ఇబ్బందులు..
స్కాలర్ షిప్ లు పెండింగ్ పెట్టటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే...అటు కాలేజ్ ఫీజులు అందక యాజమాన్యాలు కూడా విద్యార్థులకు చదువు చెప్పలేని పరిస్థితి వచ్చిందన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి తలెత్తుతుందని దానికి ఈ కాంగ్రెస్ సర్కారే బాధ్యత వహించాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.
స్కాలర్ షిప్ లు విడుదల చేయాలి..
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణంగా పేద విద్యార్థుల తల్లితండ్రులు అప్పులు తెచ్చి పిల్లలను చదవిస్తున్నారన్నారు. ఇకనైనా ప్రభుత్వం పేద విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటం ఆడటం మానేయాలన్నారు. వెంటనే భోదన రుసుము బకాయిలు, స్కాలర్ షిప్ లు విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications