తెలంగాణ ఉందని కేంద్రానికి తెలుసా: షబ్బీర్, జైట్లీకి కవిత కంగ్రాట్స్, ఉత్సుకత
న్యూఢిల్లీ/కవిత: అసలు కొత్తగా తెలగాణ రాష్ట్రం ఒకటి ఉందని కేంద్ర ప్రభుత్వానికి తెలుసా, తెలియదా అని కాంగ్రెస్ పార్టీ మండలి నేత షబ్బీర్ అలీ సోమవారం నాడు ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ అనే కొత్త రాష్ట్రం ఉన్నట్లు కేంద్రానికి తెలుసా అని ప్రశ్నించారు. ప్రతి బడ్జెట్‌లోను తెలంగాణ రాష్ట్రానికి అన్యాయమే జరుగుతోందన్నారు. ఎప్పుడూ ఆంధ్రప్రదేశేనా అని నిలదీశారు. బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.
ముస్లీంలకు 4 శాతం రిజర్వేషన్ అంశం పైన సుప్రీం కోర్టు విచారణకు తెలంగాణ సర్కార్ నుంచి ఎవరూ కూడా రాలేదని ఆరోపించారు. తెలంగాణ సీఎం కెసిఆర్ 12 శాతం రిజర్వేషన్లు ముస్లీంలకు ఇస్తామని చెప్పారని, దాని మాట ఏమయిందని ప్రశ్నించారు.

జైట్లీకి కవిత కంగ్రాట్స్
లోకసభలో ఈ రోజు ఉదయం సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీకి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్లో 'బడ్జెట్లో మౌలిక, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలపై ప్రధానంగా దృష్టి పెట్టినందుకు జైట్లీకి కంగ్రాట్స్. ఈ బడ్జెట్లో తెలంగాణ ఎంతవరకు కేటాయింపులు దక్కించుకుంటుందో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది' అని ట్వీట్ చేశారు.
వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిపై ఎక్కువ దృష్టిపెట్టారు: ఫ్యాప్సీ
బడ్జెట్‌పై ఫ్యాప్సీ స్పందించింది. ఫ్యాప్సీ అధ్యక్షులు అనిల్ రెడ్డి మాట్లాడుతూ.. బడ్జెట్‌లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి అంశాలపై దృష్టి పెట్టారన్నారు. గ్రామీణ యువత ఎదగడానికి మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. ఆహార శుద్ధి పరిశ్రమ అభివృద్ధి చెందుతుందన్నారు. వచ్చే బడ్జెట్‌లో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications