మంత్రిగా వై నాట్ యశస్విని రెడ్డి.. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆమెపైనే చర్చ!!
ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంతా ఒకటే చర్చ.. రాజకీయ ఉద్దండుడు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించిన యశస్విని రెడ్డికి కాంగ్రెస్ తగిన అవకాశం ఇవ్వాలని జోరుగా చర్చ జరుగుతుంది. మంత్రి ఎర్రబెల్లి రాజకీయ అనుభవం అంత లేని వయసున్న యశస్విని రెడ్డి మంత్రి ఎర్రబెల్లిని ఎదుర్కొన్న తీరుపై రాష్ట్రం మొత్తం చర్చించింది. అలాంటి యశస్వినిరెడ్డికి ప్రస్తుత క్యాబినెట్ లో స్థానం ఇస్తే బాగుంటుంది అన్న చర్చ జరుగుతుంది.
రాజకీయాల్లోకి వచ్చి తొలి పోటీలోనే కొడితే ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టాలన్న చందంగా మంత్రి ఎర్రబెల్లికి ముచ్చెమటలు పట్టించి, మూడు చెరువుల నీళ్ళు తాగించిన యశస్విని రెడ్డి పేరు ఇప్పుడు మారు మోగిపోతుంది. పిట్ట కొంచెం కూత ఘనం అన్న చందంగా పిన్న వయస్కురాలైన యశస్విని రెడ్డి మంత్రి ఎర్రబెల్లిని ఓడించటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

మంత్రి ఎర్రబెల్లిని తట్టుకుని ఎన్నికల్లో వీరోచితంగా ఆమె పోరాడిన తీరు కాంగ్రెస్ పార్టీలోనూ చర్చనీయాంశం అయ్యింది. అయితే అలాంటి యశస్విని రెడ్డికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వకూడదు, యంగ్, ఎనర్జిటిక్ మహిళా ఎమ్మెల్యేకు ఎందుకు తగిన ప్రాధాన్యత ఇవ్వకూడదు అన్న చర్చ జరుగుతుంది. మంత్రిగా వైనాట్ యశస్విని రెడ్డి అని చాలా మంది చర్చిస్తున్నారు.
దశాబ్దాల రాజకీయ అనుభవం ఉండి, అనేకమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకులు పెద్ద సంఖ్యలో ఉన్న కాంగ్రెస్ లో తొలిసారి పోటీ చేసి గెలిచిన ఆమెకు మంత్రిగా స్థానం ఉండదని తెలిసినా, ఆమెకు అవకాశమిస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చిన, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని ఓడించిన యశస్విని రెడ్డికి ఐటీ శాఖని ఇస్తే బాగుంటుందని జనాలు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నారై గా, రాష్ట్రానికి కంపెనీలను తీసుకురావడంలో యశస్విని రెడ్డి బాగా పని చేసే సత్తా ఉన్న నాయకురాలని అంటున్నారు.లేదంటే ఎర్రబెల్లి మంత్రిత్వ శాఖ అయిన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను ఇస్తే బాగుంటుంది అని భావిస్తున్నారు. సీనియారిటీని పక్కన పెడితే యశస్విని రెడ్డికి కూడా అవకాశం ఇస్తే బాగుంటుందని చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications