25ఏళ్లు, పార్టీకి డబ్బుల్లేవ్!: పవన్ ట్విస్ట్, జిహెచ్ఎంసీపై తేల్చేసినట్లేనా, పోరాటమే?
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పార్టీ విషయమై కొత్త ట్విస్ట్ ఇచ్చారు! ఏపీ రాజధాని ప్రాంతంలో భూసేకరణను వ్యతిరేకిస్తున్న పెనుమాక రైతులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తన పార్టీ పైన మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... తన పార్టీ భవిష్యత్తుపై స్పష్టతనిచ్చారు. తన విజన్ ఇరవై అయిదు సంవత్సరాలని చెప్పారు. ఇప్పటికిప్పుడే రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన తనకు లేదన్నారు. జనసేనలో ఇతర నేతలు కూడా ఎవరూ లేరన్నారు.
తమలాంటి అభిమానులు మాత్రమే ఉన్నారని చెప్పారు. అయినా పార్టీని నడపడానికి తన దగ్గర అంత డబ్బు కూడా లేదన్నారు. సినిమాల ద్వారా సంపాదించేదే తన డబ్బు అని, ఆ డబ్బు కూడా మీరు కొనే టికెట్ల ద్వారానే వస్తుందన్నారు.

పవన్ వ్యాఖ్యల ద్వారా ఇప్పుడప్పుడే ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అవకాశం తక్కువగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి.. తనకు ప్రజల సంక్షేమం ముఖ్యమని, పదవులు ముఖ్యం కాదని చెబుతూ వస్తున్నారు.
అందులో భాగంగానే గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి - బిజెపి కూటమికి మద్దతిచ్చినట్లు చెప్పారు. ఇటీవల పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ టిడిపికి దూరం కావొచ్చని, 2019 ఎన్నికల్లో పార్టీ పోటీ ఉంటుందనే ఊహాగానాలు వినిపించాయి.
అంతేకాదు, హైదరాబాదులో జరగనున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయవచ్చుననే ఊహాగానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే, టిడిపి - బిజెపికి మద్దతిస్తారా? ఒంటరిగా పోటీ చేస్తారా? టిడిపి, బిజెపిలు వేరుపడితే ఎవరు వైపు ఉంటారనే చర్చ ఇన్నాళ్లు సాగింది.
కానీ, పవన్ కళ్యాణ్ అనూహ్యమైన ట్విస్ట్ ఇచ్చారు. తన విజన్ 25 ఏళ్లని చెప్పారు. ఇప్పుడప్పుడే రాజకీయాల్లోకి రావాలని లేదన్నారు. అయితే, ప్రజల కోసం, ప్రజల తరఫున పోరాటానికి ఆయన సిద్ధమని చెప్పారు. ప్రజల కోసం రోడ్డెక్కేందుకు పవన్ సిద్ధంగా ఉంటారని అభిమానులు కూడా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications