టీఆర్ఎస్, కూటమికి 'బీజేపీ' భయం: రంగంలోకి యోగి ఆదిత్యనాథ్, అక్కడ కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. ఓ వైపు టీఆర్ఎస్, మరోవైపు తెలుగుదేశం, కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జన సమితిలతో కూడిన ప్రజా ఫ్రంట్ (మహాకూటమి). 119 నియోజకవర్గాలలో దాదాపు వందకు పైగా సీట్లలో ఈ రెండు పార్టీల మధ్యనే హోరాహోరీ ఉండనుంది. పాతబస్తీలో మజ్లిస్ హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత ఎన్నికల్లో అయిదు స్థానాల్లో గెలిచిన బీజేపీ ఈసారి రెండంకెల స్థానంపై కన్నేసింది.
అంతేకాకుండా, పలు కారణాల వల్ల చాలాచోట్ల బీజేపీ ప్రత్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనుంది. ఇటీవల పేరున్న నాయకులు కమలం పార్టీలో చేరడం, 2014 కంటే పార్టీ ఒకింత పుంజుకోవడం తదితర కారణాల వల్ల చాలా స్థానాల్లో ఇతరుల గెలుపోటములను ప్రభావితం చేసే పరిస్థితి నెలకొని ఉంది. ఇది తెరాస, కూటమి అభ్యర్థులను వణికిస్తోంది.

పాతవాటితో పాటు డబుల్ డిజిట్ పైన దృష్టి
హైదరాబాదులో అంబర్‌పేటలో కిషన్ రెడ్డి, గోషామహల్‌లో రాజాసింగ్ లోథ్, ఖైరతాబాద్‌లో రామచంద్ర రావు, ముషీరాబాద్ లక్ష్మణ్, ఉప్పల్ ప్రభాకర్‌లు మరోసారి కచ్చితంగా గెలుస్తారని కేడర్ ధీమాగా ఉంది. దీనికి తోడు కరీంనగర్‌లో బండి సంజయ్, సూర్యాపేటలో సంకినేని వెంకటేశ్వర రావు, కల్వకుర్తిలో ఆచారి, ఆందోల్ నుంచి బాబూమోహన్‌లతో పాటు రఘునందన్ తదితరులు సీట్లు తమ ఖాతాలో పడుతాయని భావిస్తున్నారు. మొత్తంగా డబుల్ డిజిట్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

గెలిచేందుకు, ఓట్ల శాతం పెంచుకొని సత్తా చాటేందుకు బీజేపీ వ్యూహం
బీజేపీ డబుల్ డిజిట్ సాధించి, తెరాసకు పూర్తి మెజార్టీ రాకుంటే తాము చక్రం తిప్పవచ్చునని బీజేపీ భావిస్తోంది. అయితే ఆ ఆశలు ఎంత వరకు నెరవేరుతాయో చూడాలి. ఈ అంశాన్ని పక్కన పెడితే, చాలాచోట్ల ఇతరులను బీజేపీ ఓట్లు ప్రభావితం చేయనున్నాయి. బీజేపీ మొత్తం 118 స్థానాలలో పోటీ చేస్తోంది. అయితే ముఖ్యంగా 30కి పైగా స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎక్కువ స్థానాల్లో ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచుకోవడంపై దృష్టి సారించింది. అంగబలం, అర్థబలం ఉన్నవారికి ఇతర పార్టీల నుంచి ఆఖరి నిమిషంలో చేర్చుకున్న మాజీ ఎమ్మెల్యేలకు, నాయకులకు టికెట్లిచ్చింది. జాతీయస్థాయి నేతలను రప్పిస్తోంది. ఈ యత్నాల వల్ల బీజేపీకి పెరిగే ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన అభ్యర్థుల జయాపజయాలపై కచ్చితంగా ప్రభావం చూపనుంది.

ఆ స్థానాల్లో గెలుపు, అక్కడ ప్రత్యర్థి పార్టీలపై దెబ్బ
గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని 45 చోట్ల బీజేపీ పోటీ చేసింది. ఇప్పుడు ఒంటరిగా సత్తా చాటాలని భావిస్తోంది. పాత స్థానాలతో పాటు మల్కాజిగిరి, కరీంనగర్, సూర్యాపేట, నిజామాబాద్ అర్బన్, ముథోల్, కల్వకుర్తి, ఆదిలాబాద్ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇక్కడ గెలుస్తామని ధీమాగా ఉంది. ఇతర చోట్ల బీజేపీ గెలుపును పక్కన పెడితే పలుచోట్ల తక్కువ ఓట్లు వచ్చే అవకాశమున్న చోట్ల కూడా ప్రధానపార్టీల విజయావకాశాల్ని ప్రభావితం చేసే అవకాశముంది.

త్రిముఖ పోటీ
ముషీరాబాద్, అంబర్‌పేట, గోషామహల్, ఉప్పల్, ఖైరతాబాద్‌లలో బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశమున్నప్పటికీ త్రిముఖ పోటీ ఉండనుంది. ముషీరాబాద్‌లో లక్ష్మణ్ పైన తెరాస నుంచి ముఠా గోపాల్, కాంగ్రెస్ నుంచి అనిల్ కుమార్ యాదవ్‌లు, అంబర్‌పేటలో కిషన్ రెడ్డి పైన తెరాస నుంచి కాలేరు వెంకటేశ్, తెలంగాణ జన సమితి నుంచి రమేశ్ ముదిరాజ్‌లు, ఖైరతాబాద్ నుంచి చింతల రామచంద్రారెడ్డి పైన తెరాస నుంచి దానం నాగేందర్, కాంగ్రెస్ నుంచి దాసోజు శ్రవణ్, ఉప్పల్‌లో ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ పైన టీడీపీ వీరేందర్ గౌడ్, తెరాస నుంచి భేతి సుభాష్ రెడ్డి, గోషామహల్‌లో రాజాసింగ్ లోథ్ పైన కాంగ్రెస్ తరఫున ముఖేష్ గౌడ్, తెరాస నుంచి ప్రేమ్‌సింగ్ రాథోడ్‌లు పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ వైపు మొగ్గినప్పటికీ పలు కారణాలతో త్రిముఖ పోటీ ఉండనుందని చెబుతున్నారు.

సీట్లపై ఆశలు
కల్వకుర్తిలో బీజేపీ అభ్యర్థి ఆచారి 78 ఓట్ల స్వల్ప తేడాతో 2014లో ఓటమి చెందారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డితో హోరాహోరీ ఉంది. మల్కాజిగిరిలో గత ఎన్నికల్లో 2,768 ఓట్లతో ఓడిపోయిన రామచంద్రరావు గట్టి పోటీ ఇవ్వనున్నారు. కరీంనగర్‌లో బండి సంజయ్ కుమార్ విజయంపై బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. పొన్నం ప్రభాకర్, గంగుల కమలాకర్‌లు ఆయనకు ప్రత్యర్థులుగా ఉన్నారు. సూర్యాపేటలో పొత్తులో అవకాశం రాక గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి రెండో స్థానంలో నిలిచిన సంకినేని వెంకటేశ్వరరావు ఈసారి మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై గెలవాలనే కసితో ఉన్నారు. ఆయన నాడు స్వతంత్రంగా స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఇప్పుడు పార్టీ అండతో కచ్చితంగా గెలుస్తారని భావిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఉన్నారు. ఆందోల్‌లో బాబూమోహన్ కారణంగా త్రిముఖ పోరు నెలకొంది.

గెలుపోటమనులను ప్రభావితం చేయనున్నారు
శేరిలింగంపల్లిలో బిజినెస్‌మ్యాన్ యోగానంద్, ఎల్బీ నగర్ నుంచి పేరాల శేఖర్, మహేశ్వరంలో సంఘ్ పరివార్ అండ ఉన్న శ్రీరాములు యాదవ్, మేడ్చల్‌లో కొంపల్లి మోహన్ రెడ్డి, భూపాలపల్లిలో మాజీ ఎంపీ జంగారెడ్డి కోడలు కీర్తిరెడ్డి, సంగారెడ్డిలో రాజేశ్వర రావు దేశ్ పాండే, ఆర్మూర్‌లో వినయ్ కుమార్ రెడ్డి, రాజేంద్ర నగర్‌లో బద్దం బాల్ రెడ్డి, చాంద్రాయణగుట్ట నుంచి షహజాదీ, జుక్కల్ నుంచి అరుణతార, చొప్పదండి నుంచి బొడిగె శోభ, భద్రాచలం నుంచి కుంజా సత్యావతి తదితరులు పోటీ చేస్తున్నారు. కానీ ఇలా పలు స్థానాల్లో బీజేపీ ఓట్లతో పాటు ఆయా నియోజకవర్గాల్లో కొంత పట్టు ఉన్న నేతలు కాబట్టి తెరాస, ప్రజా ఫ్రంట్ అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనున్నారు. సంగారెడ్డిలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రచారానికి రప్పిస్తున్నారు. ఇక్కడ ఆయన ఏ మేరకు ప్రభావం చూపుతారో చూడాల్సి ఉంది. ఆయన రాక బీజేపీకి ఏ మేరకు లాభిస్తుందో చూడాలి. సంగారెడ్డిలో కాంగ్రెస్ తరఫున జగ్గారెడ్డి నిలబడ్డారు. ఆయనపై ఏ మేరకు ప్రభావం పడుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications