మందు బాబులకు మళ్లీ షాక్.. రెండు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్
మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మండుటెండల్లో చల్లని బీర్లు తాగుతూ ఉపశమనం పొందుదాం అనుకుంటున్న మందుబాబులకు 48 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులపాటు మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్టు ప్రకటించింది.
48 గంటలపాటు మద్యం దుకాణాలు బంద్
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడం కోసం ప్రతిసారి ఎన్నికల సమయంలో ఈ నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది.మే 11న శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మే 13న సోమవారం సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలను మూసివేయాలని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ రోజుల్లో లిక్కర్ దొరకటం కష్టమే
వైన్ షాపులు, బార్లు మాత్రమే కాకుండా కల్లు కాంపౌండ్లు కూడా రెండు రోజులపాటు మూతపడనున్నాయి. అంతే కాదు మళ్లీ ఎన్నికల ఫలితాల రోజు కూడా మద్యం దుకాణాలు మూతపడతాయని పేర్కొంది. జూన్ 4వ తేదీన మందు బాబులకు లిక్కర్ దొరకదని వెల్లడించింది. ఇక ఎన్నికల ఫలితాల రోజున శంషాబాద్ లో డ్యూటీ ఫ్రీ షాప్స్ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేస్తున్నట్టు పేర్కొంది.
ఓటర్లను ప్రభావితం చేయకుండా చర్యలలో భాగంగా
రాష్ట్రవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శనివారం సాయంత్రంతో ప్రచార గడువు ముగుస్తుంది. అదే రోజు నుండి ఎన్నికలు ముగిసే వరకు మద్యం దుకాణాలు మూతపడతాయి.రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేయడానికి రాజకీయ పార్టీలు మద్యం పంపిణీ చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలు జరగటానికి ముందు నుంచి మద్యం దుకాణాలు బంద్ చేయడం ప్రతి ఎన్నికల సమయంలో అనవాయితీగా వస్తుంది.
ఎన్నికల నేపధ్యంలోనే మద్యం దుకాణాల మూసివేత
కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు ఎక్కడ ఎన్నికలు జరిగినా తప్పనిసరిగా మద్యం దుకాణాల మూసివేత కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో అక్రమ లిక్కర్ కట్టడికి ఇప్పటికే పోలీసులు , టాస్క్ఫోర్స్ అధికారులు కేసులు నమోదు చేస్తూ ప్రయత్నిస్తున్నారు. ఇక బెల్టు షాపుల పైన కూడా కొరడా ఝుళిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications