దారుణం: మహిళపై అత్యాచారం, హత్య
మెదక్: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహిత మహిళపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు, ఆమెను హత్య చేశారు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పుల్కల్ మండలం ఎస్.ఇటిక్యాల శివారులోని చెరుకుతోటలో వివాహిత మల్లమ్మ (28) మృతదేహాన్ని గుర్తించారు.
వివరాల్లోకి వెళితే.. మల్లమ్మ తన భర్త మరణించడంతో తల్లిగారి గ్రామమైన ఎస్.ఇటిక్యాలలో ఉంటోంది. స్థానిక కల్లు దుకాణంలో పనిచేస్తూ జీవిస్తోంది. అయితే డిసెంబర్ 20న ఎప్పటిలాగే పనికి వెళ్లిన మల్లమ్మ రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం వెతికారు. బంధువులు, తెలిసిన వారి వద్ద ఆరా తీశా రు. కానీ ఆమె జాడ ఎక్కడ కనిపించకపోవడంతో డిసెంబర్ 24వ పుల్కల్ పోలీస్‌స్టేషన్‌లో మృతురాలి సోదరుడు బీరప్ప ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ లోకేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మల్లమ్మ గత తొమ్మిది రోజులుగా కనిపించకుండా పోగా ఆమె కోసం చుట్టుపక్కల గ్రామాలు, బంధువుల వద్ద ఆరా తీసినప్పటికీ ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం గ్రామానికి చెందిన మల్లయ్య తన మేకలను గ్రామశివారులో మేపుతుండగా దుర్వాసన వచ్చింది. దీంతో అతను సమీపంలోని చెరుకుతోట వైపు వెళ్లి చూడగా, గుర్తుపట్టలేని విధంగా మహిళ శవం కనిపించింది. దీంతో అతను గ్రామ పెద్దలకు సమాచారాన్ని అందించారు.
ఒంటిపై ఉన్న బట్టలను చూసి మల్లమ్మ మృతదేహంగా ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకొని పంచనామా నిర్వహించారు. వారం రోజుల క్రితమే ఆమెపై లైంగికదాడి, ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహం కాళ్లు, చేతులు జంతువులు పీక్కుతినడంతో భయాందోళన కలిగించే విధంగా ఉంది.
మృతదేహాన్ని, సంఘటన జరిగిన స్థలాన్ని, చుట్టు పరిసరాలను జోగిపేట సీఐ నాగయ్య పరిశీలించారు. ఆమెపై ఎవరో లైంగికదాడికి పాల్పడి, హత్య చేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, ఘటనపై కారణాలను తెలుసుకుంటామని ఆయన పేర్కొన్నా రు.












Click it and Unblock the Notifications