ఫేక్ సర్టిఫికేట్ దందా, ఒక్కో దానికి ఒక్కో ధర: కిలేడీ అరెస్ట్
హైదరాబాద్: ఫేక్ సర్టిఫికేట్ దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఎస్సెస్సీ నుంచి ఇంజినీరింగ్ వరకు ఏ సర్టిఫికేట్ అయినా తయారు చేసి ఇస్తున్న మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఫేక్ సర్టిఫికేట్లలో ఒక్కో దానికి ఒక్కో ధరను కేటాయించింది.
ఎస్సార్ నగర్లో ఈడీపీ టెక్నాలజీస్ పేరుతో కంపెనీ స్థాపించి ఓ మహిళ ఎంతోమందిని బురిడీ కొట్టించింది. నకిలీ సర్టిఫికేట్స్ ఇస్తూ లక్షల రూపాయలు వసూలు చేసింది. ఆమెను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం నాడు అరెస్టు చేశారు.
కాకినాడకు చెందిన నాగమౌని ఈ దందాలో ప్రధాన నిందితురాలు. 2005లో భర్త, పిల్లలతో కలిసి హైదరాబాద్ వచ్చింది. అమీర్‌పేట మోడల్ అకాడమీలో కౌన్సెలర్‌గా పని చేసింది. ఆ అకాడమీని మూసేయడంతో మరో ఇనిస్టిట్యూట్‌లో చేరింది. అదీ మూతపడటంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది.

భర్త ఏ పనీ చేసేవాడు కాదు. 2010లో ఈడీపీ టెక్నాలజీస్ పేరుతో ఎస్సార్ నగర్లో ఓ అపార్ట్‌మెంటులో కంపెనీ ఏర్పాటు చేసింది. వ్యాపారంలో లాభం కనిపించలేదు. దీంతో నకిలీ సర్టిఫికేట్ దందా దారి పట్టింది. ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ సర్టిఫికెట్లను తయారు చేసేది.
అన్ని యూనివర్సిటీల ఒరిజినల్ సర్టిఫికెట్స్ మాదిరిగానే నకిలివి సృష్టించింది. వినోబాబావే యూనివర్సిటీ, హాజరీబాగ్, సీఎమ్‌జీ, మేఘాలయ, హరన్‌సింగ్ తదితర యూనివర్సిటీల నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసేది. ఎవరికి అవసరమో వారిని బ్రోకర్స్ ద్వారా పరిచయం చేసుకునేది.
సామాజిక మీడియా ద్వారా కూడా ప్రచారం చేసింది. ఇంజనీరింగ్‌కు 75 వేలు, ఎంబీఏకు 50 వేలు, ఎంసీఏకు 40 వేలు, డిగ్రీ సర్టిఫికెట్స్‌కు 15 వేలు, ఇంటర్‌కు 12 వేలు వసూలు చేసింది. ఇప్పటి వరకూ 250 మందికి నకిలీ సర్టిఫికెట్స్ అందజేసింది. పోలీసులకు విషయం తెలియడంతో అరెస్ట్ చేశారు. 33 ఫేక్ సర్టిఫికెట్స్, కంప్యూటర్, పదివేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.