18ఏళ్లుగా ఆమె చీకటి గదిలోనే.. విస్మయం కలిగించేలా!, పట్టించుకోరా?
సాలార్‌పూర్ గ్రామానికి చెందిన భారతిభాయి అనే మహిళ 18 ఏళ్లుగా ఓ చీకటి గదికే పరిమితమై బతుకుతోంది.
హైదరాబాద్ : నాలుగు గోడల నడుమ.. ఒకరోజు గడపడానికే ఏదోలా అనిపిస్తుంటుంది. అలాంటిది బయటి ప్రపంచాన్ని పూర్తిగా పక్కనబెట్టేసి.. కేవలం నాలుగు గోడలకే పరిమితమై.. 18ఏళ్లుగా ఒకే గదిలో జీవనం సాగిస్తే..! రంగారెడ్డి పరిధిలోని సాలార్ పూర్ లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది.
సాలార్‌పూర్ గ్రామానికి చెందిన భారతిభాయి అనే మహిళ 18 ఏళ్లుగా ఓ చీకటి గదికే పరిమితమై బతుకుతోంది. 24 ఏళ్ల క్రితం భర్త మతిస్థిమితం కోల్పోవడంతో తీవ్ర కుంగిపోయిన భారతిభాయి కూడా మతిస్థిమితం లేకుండా తయారైంది. అప్పటినుంచి పుట్టినింటిలో ఉంటున్న ఆమె.. ఓ చీకటిగదిలోనే కాలం వెళ్లదీస్తోంది. నిద్రాహారాలు అన్ని ఆ చీకటి గదిలోనే. ఒక్క భోజనం మాత్రమే అన్న రామచందర్‌జీ తలుపు సంధులోంచి అందిస్తారు.

ఆ గదిలోకి ఎవరూ వెళ్లరు.. ఆమె అందులోంచి బయటకు రాదు. ఎవరినైనా పలకరించినా.. ఆ చీకటి గదిలోంచే. ఒక్కోసారి పిచ్చి పట్టినట్టుగా అరుస్తుంటుంది. ఆమె పరిస్థితి గురించి ఎవరు ఆరా తీయరు? ఆమె అలా ఎందుకు తయారైందో ఎవరు పట్టించుకోరు!. అయితే ఆమె అన్న రామచందర్ జీ చెబుతున్న ప్రకారం.. వారిది నిరుపేద కుటుంబం.
ప్రస్తుతం భారతిభాయి బాధ్యతలు కూడా తానే చూసుకోవడం తలకు మించిన భారంగా మారింది. ఆమె ఆరోగ్యం బాగుచేయించాలని ఉన్నా.. చేతిలో డబ్బు లేదు. కాబట్టి ప్రభుత్వమే ఏదైనా సహాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నాడు. ప్రస్తుతం పెన్షన్, ఇతర ప్రభుత్వ పథకాలేవి కూడా భారతి పొందడం లేదు.












Click it and Unblock the Notifications