హైదరాబాద్ ఆస్పత్రి నుంచి మహిళ మాయం: లాస్ట్ కాల్ నెల్లూరు వ్యక్తిది
హైదరాబాద్: మూడు రోజుల క్రితం కుమారుడి వైద్యం కోసం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ జంట నగరానికి వచ్చింది. కాగా, హైదరాబాద్ నగరానికి వచ్చిన కొద్ది గంటల్లోనే తన భార్య అదృశ్యమైందని భర్త పోలీసులను ఆశ్రయించాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు, గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, తల్లి ఒక్కసారిగా కనిపించకపోవడంతో ఆ ఏడాదిన్నర కుమారుడు తల్లడిల్లిపోతున్నాడు.
వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా అవిడికొత్తపేటకు చెందిన వెంకన్నబాబు, కె.జ్యోతి(24) దంపతులు తమ ఏడాదిన్నర కుమారుడికి చికిత్స నిమిత్తం ఫిబ్రవరి 15న హైదరాబాద్ నగరంలోని రెయిన్‌బో ఆస్పత్రికి వచ్చారు.

బాలుడికి స్కానింగ్ చేయాలని వైద్యులు చెప్పడంతో వారు కొడుకును తీసుకొని సమీపంలోని ఓ స్కానింగ్ సెంటర్‌కు వచ్చారు. కొడుకుతో పాటు వెంకన్న స్కానింగ్ ల్యాబ్‌లోకి వెళ్లగా జ్యోతి ఆస్పత్రి ఆవరణలో కూర్చుంది.
కాగా, మధ్యాహ్నం బయటకు వచ్చిన వెంకన్నకు తన భార్య కనిపించకపోగా ఆమె హ్యాండ్ బ్యాగ్ ఫోన్ అక్కడ పడి ఉండడంతో ఆందోళనకు గురై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు జ్యోతి ఫోన్ కాల్ డేటాను సేకరించారు. అదృశ్యమయ్యే ముందు ఆమె రమేష్ అనే యువకుడితో మాట్లాడినట్లు తేలింది. దీంతో పోలీసులు రమేష్ ఫోన్‌పై నిఘా ఉంచారు.
కాగా, అతను నెల్లూరులో ఉన్నట్లు తేలడంతో ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపారు. వివాహేతర సంబంధమే ఆమె అదృశ్యానికి కారణమా? లేక ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా? అనేది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications