ఆ జిల్లాలో మహిళల పెట్రోల్ బంక్.. 6 నెలల్లోనే భారీ లాభాలు
తెలంగాణలోని మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసింది. ఆ తర్వాత రూ. 500లకే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించింది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అలాగే 'ఇందిర మహిళా శక్తి' పథకాన్ని ప్రారంభించి స్వయం సహాయక బృందాల మహిళలను ప్రోత్సహిస్తోంది. మహిళలను వ్యాపారులుగా తీర్చిదిద్దేందుకు రేవంత్ సర్కార్ కృషి చేస్తోంది.
దేశంలోనే తొలిసారిగా జిల్లా మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహిళల నిర్వహణతో లాభాల బాటలో నడుస్తున్న నారాయణపేట జిల్లా సమాఖ్య పెట్రోల్ బంక్ సత్తా చాటుతోంది. ప్రారంభమైన 6 నెలల్లో అంచనాలకు మించి లాభాలు ఆర్జించింది. ఒక సరికొత్త రికార్డును నెలకొల్పింది. కేవలం 6 నెలల్లోనే సుమారు రూ.14 లక్షల లాభాలు గడించి మహిళలు సత్తాచాటారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగారం గేటు వద్ద జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఏడాది ఫిబ్రవరి 21న ఈ పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు. మొదట్లో రోజుకు 1500 లీటర్ల చొప్పున పెట్రోల్, డీజిల్ విక్రయించేవారు. ప్రస్తుతం ఈ బంక్ లో 11 మంది మహిళలు పని చేస్తున్నారు.

గతంలో నారాయణపేట జిల్లా కలెక్టర్ గా పనిచేసిన కోయ శ్రీహర్ష చొరవతో ఇందిర మహిళా శక్తి పథకంలో భాగంగా రూ. 1.30 కోట్ల వ్యయంతో ఈ పెట్రోల్ బంక్ ను నెలకొల్పారు. మెత్తం ఆరు నెలల్లోనే సుమారు రూ.14 లక్షల లాభాలు గడించింది ఈ బంకు. ఇక నెలకు అన్ని ఖర్చులు పోను రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షలు ఆదాయం వస్తుంది. రాష్ట్రంలో మొదటి మహిళా పెట్రోల్ బంక్ ఇదే కావడం విశేషం. రానున్న కాలంలో మరిన్ని మహిళా పెట్రోల్ బంక్ లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.












Click it and Unblock the Notifications