ఆపరేషన్ సిందూర్ విజయం కోసం ఆలయాల్లో పూజలు చెయ్యమన్న కాంగ్రెస్ మంత్రి!
పహల్గాంలో పర్యాటకులను చంపిన తీవ్రవాదుల ఏరివేతే లక్యంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్-టార్గెట్ విజయవంతం కావాలని మంత్రి కొండా సురేఖ దేవాదాయ శాఖకి కీలక ఆదేశాలు జారీ చేశారు. మన రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయంలో ఇండియన్ ఆర్మీకి మద్దతుగా పూజలు చేయాలని మంత్రి కొండా సురేఖ ఆదేశాలు ఇచ్చారు. ఇంతటి సంక్లిష్టమైన సమయంలో భారత ఆర్మీకి మనమంతా అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.
ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావటం సంతోషం
పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన "ఆపరేషన్ సిందూర్" రెండో దాడి విజయవంతం అవడం హర్షించదగ్గ విషయం అని ఆమె పేర్కొన్నారు. కోట్లి వద్ద గుల్పూర్ ప్రాంతంలో ఉన్న లష్కరే తోయిబా నియంత్రణ కేంద్రాన్ని ఇండియన్ ఆర్మీ పూర్తిగా నాశనం చేసిందని, ఇది సంతోషించాల్సిన అంశమన్నారు. అత్యాధునిక ఆయుధాలతో ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేసిన దృశ్యాలను భారత భద్రతా సంస్థలు అధికారికంగా విడుదల చేశాయని పేర్కొన్నారు.

ఆర్మీ క్షేమం కోసం మనమంతా పూజలు చేయడం సందర్భోచితం
ఉగ్రవాదంపై పోరాటం కొనసాగుతుందని భారత ఆర్మీ బలగాలు ప్రకటించాయన్నారు. ఆర్మీ బలగాలు సరిహద్దులో పెద్ద ఎత్తున పోరాడుతున్న సమయంలో వారి క్షేమం కోసం మనమంతా పూజలు చేయడం సందర్భోచితం అని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. తీవ్రవాద దాన్ని యావత్ భారతదేశం ఉక్కు పిడికిలితో ఎదుర్కొందని, ఈ సమైక్యత దేశ భద్రత విషయంలో రానున్న రోజులలో కూడా ఉంటుందని అన్నారు.
తెలంగాణా మంత్రిగా కాదు, దేశ పౌరురాలిగా సంతోషంగా ఉన్నా
తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా... ఎక్కడ ఉన్నా కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. మన దేశ పౌరుల మీద ఇటీవల కాశ్మీర్ లో జరిగిన దాడికి నిరసనగా ఇండియన్ మిలటరీ చేపట్టిన సిందూర్ ఆపరేషన్ ను అందరం స్వాగతిస్తున్నామని పేర్కొన్న కొండ సురేఖ తెలంగాణ మంత్రిగా కాదు, ఇంతటి గొప్ప దేశ పౌరురాలిగా, ఈ చర్యపై చాలా సంతోషంగా భావిస్తున్నా అని స్పష్టం చేశారు.
ఆపరేషన్ సిందూర్ తో భారత్ తలెత్తి నిలిచింది
పుల్వామాలో మనం కోల్పోయిన వీర సైనికులను తిరిగి తీసుకురాలేం, వారి త్యాగం శాశ్వతం. మనమున్నంత కాలం వారిని స్మరించుకుంటాం అని పేర్కొన్నారు. 'ఆపరేషన్ సిందూర్' ద్వారా భారత్ తలెత్తి నిలిచిందని, ఏకత్వంతో, శక్తితో, నిశ్శబ్దమైన సంకల్పంతో మనలని ప్రపంచం నిలబెట్టిందని పేర్కొన్నారు.
ఇది కేవలం ప్రతిస్పందన కాదు, ఒక ప్రతి సమాధానం అని స్పష్టం చేశారు.
అన్ని పార్టీలను కలుపుకుపోవాలన్న కొండా సురేఖ
కేంద్రప్రభుత్వం ఈ విషయంలో చాలా మర్యాదగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ భద్రత విషయంలో అందరినీ కలుపుకోవాలి. ఎందుకంటే, ఇది దేశానికి సంబంధించిన విషయం అని కొండా సురేఖ పేర్కొన్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి రాజకీయం చేయాలని అనుకోవడం లేదు. చేయదు కూడా అని స్పష్టం చేశారు. మేము భారత ఆర్మీకి పూర్తి మద్దతుగా ఉన్నామని పేర్కొన్న కొండ సురేఖ రానున్న రోజుల్లో కూడా ఉంటాం అని చెప్పారు. అందుకే ఈరోజు మా రాష్ట్రంలోని ప్రతి గుడిలో..దేవాలయాల్లో ఆర్మీకి మంచి జరగాలని పూజలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.












Click it and Unblock the Notifications