అల్లు అర్జున్ అరెస్టయినప్పటి నుంచి అన్నం కూడా తినని సినీ రైటర్..
Allu Arjun release: ఐకన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. కొద్దిసేపటి కిందటే ఆయన భారీ బందోబస్తు మధ్య గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. తెలంగాణ హైకోర్టు ఆయనకు శుక్రవారం సాయంత్రమే నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 50 వేల రూపాయల పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది.
అయినప్పటికీ- విడుదల ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల రాత్రంతా జైలులో గడపాల్సి వచ్చింది. ఈ పరిణామాన్ని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది జీ అశోక్ రెడ్డి తప్పు పట్టారు. చంచల్ గూడ సెంట్రల్ జైలు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యాయపోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. లీగల్‌గా ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయిస్తామని పేర్కొన్నారు.

ఈ పరిణామాలపై ప్రముఖ సినీ కథా రచయిత చిన్ని కృష్ణ ఘాటుగా స్పందించారు. అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రికి కథను అందించింది ఆయనే. ఆయన విడుదల అవుతున్నారనే సమాచారం తెలిసి ఈ తెల్లవారు జామునే గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.
అల్లు అర్జున్ అంటే తనకు ప్రాణమని, ఆయన అరెస్ట్ అయినప్పటి నుంచి అన్నం కూడా తినలేదని చిన్ని కృష్ణ అన్నారు. ఆయనకు అరెస్ట్ మరకలు అంటించిన ఏ వ్యక్తి అయినా, ఏ నాయకుడైనా సర్వ నాశనమౌతాడని శాపనార్థాలు పెట్టారు. ఇదొక ఫ్యాబ్రికేటెడ్ కేసు అని విమర్శించారు. ఉద్దేశపూరకంగా ఆయనను ఇరికించారని ఆరోపించారు.
బెయిల్ లభించినప్పటికీ విడుదల చేయకపోవడం ఏ మాత్రం సరికాదని చిన్ని కృష్ణ చెప్పారు. అల్లు అర్జున్ భారత చలన చిత్ర పరిశ్రమకు ఓ విలువైన ఆస్తి లాంటివాడని పేర్కొన్నారు. పుష్ప సినిమాలో ప్రదర్శించిన నటనకు టాలీవుడ్ నుంచి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న మొట్టమొదటి హీరో కావడమే దీనికి నిదర్శనమని చెప్పారు.












Click it and Unblock the Notifications