యాస్ ఎఫెక్ట్: రానున్న 48 గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు, ఈదురుగాలులు
హైదరాబాద్: యాస్ తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ తాజా హెచ్చరికలు జారీ చేసింది. మరో మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం తీవ్రమై సోమవారం ఉదయం 05.30 గంటలకు తూర్పు మధ్య బంగాళాఖాతంలో యాస్ తుఫాన్ ఏర్పడింది. సోమవారం ఉదయం 08.30 గంటలకు పరదిప్ కి దక్షిణ ఆగ్నేయ దిశగా 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.
ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదిలి, మరింత తీవ్రతతో బలపడి రాగల 12 గంటలలో తీవ్ర తుఫానుగా, తదుపరి 24 గంటలలో అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. సోమవారం అర్దరాత్రి తర్వాత పెనుతుఫానుగా మారనుందని తెలిపింది.

అది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ, మరింత బలపడి, వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్‌కి దగ్గరగా.. ఉత్తర ఒడిశా తీరాలకు 26వ తేదీ ఉదయం చేరుకుంటుందని తెలిపింది. మే 26 సుమారుగా మధ్యాహ్నం ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలను, పరదీప్ - సాగర్ ఐలాండ్‌ల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావం బలమైన కింది స్థాయి గాలులు వాయువ్య, పశ్చిమ దిశల నుండి తెలంగాణా మీదకి వీయనున్నాయి.
Recommended Video
రాగల మూడు రోజులు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు ఒకటి రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గాలి వేగం గంటకి 30 నుండి 40 కిలోమీటర్లగా ఉండనుంది. మంగళవారం ముఖ్యంగా దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర కోస్తాలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అధికారులను, ప్రజలను అప్రమత్తం చేసింది. పశ్చిమబెంగాల్, ఒడిశాలో తీరాన్ని తాకే అవకాశం ఉండటంతో ఆ రాష్ట్రాల్లో ఇప్పటికే కేంద్ర విపత్తు సహాయ బృందాలు చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టాయి.












Click it and Unblock the Notifications