తెలంగాణ ప్రభుత్వం అడ్వైజరీ
సోమవారం నాడు దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధపడుతున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. చీకటిని పారదోలి అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపే దీపావళి పండగకు హైదరాబాద్ లో అరుదైన గుర్తింపు ఉంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే ఈ వేడుకల కోసం భారీగా బాణాసంచాను కొనుగోలు చేస్తోన్నారు. పండుగ సందడి, కొనుగోళ్లతో మార్కెట్లన్నీ కూడా క్రిక్కిరిసిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సూచనలు ఇచ్చింది. దీపావళి పండగను సురక్షితంగా జరుపుకోవాలని కోరింది. అగ్ని ప్రమాదాలు నివారించడానికి, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి ప్రత్యేకంగా అడ్వైజరీని జారీ చేసింది. బాణాసంచా కాల్చే సమయంలో చేయవలసినవి, చేయకూడనివి సూచించింది.

చేయవలసినవి..
- లైసెన్స్ పొందిన విక్రేతల వద్ద నాణ్యమైన బాణాసంచాను కొనుగోలు చేయాలి.
- బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే పటాసులను కాల్చాలి.
- భవనాలు, అపార్ట్మెంట్లు, ఫ్లాట్ లల్లో బాణాసంచాను కాల్చకూడదు. వాటిని కాల్చే సమయంలో వాహనాలను దూరంగా ఉంచాలి. బాణాసంచాను మంటలకు దూరంగా ఉంచాలి.
- పటాసులు కాల్చే సమయంలో పిల్లలపై నిఘా ఉంచాలి. బకెట్ లో నీళ్లు, ఇసుక, మంటలను ఆర్పడానికి ఉపయోగించే ఎక్స్టింగ్విషర్లు పక్కనే ఉంచుకోవాలి.
- ఇంటిని విద్యుద్దీపాలతో అలంకరించడానికి ముందే వాటిని చెక్ చేయించుకోవాలి. డ్యామేజ్ ఉన్న వాటిని ఉపయోగించవద్దు.
- పర్యావరణ హిత, తక్కువ శబ్దం చేసే పటాకులను కాల్చాలి.
- పటాకులు కాల్చేటప్పుడు కాటన్ లేదా అగ్నిని నిరోధించే వస్త్రాలను ధరించాలి.
చేయకూడనివి..
- విద్యుత్ పరికరాలు, గ్యాస్ సిలిండర్ల దగ్గర పటాకులు కాల్చవద్దు
- సింథటిక్ లేదా లూజ్ వస్త్రాలు ధరించి పటాకులు కాల్చవద్దు
- దీపాలు, కొవ్వొత్తులను ఎక్కడపడితే అక్కడ వదలకూడదు
- పటాకులను ఇంట్లో లేదా వేడి వస్తువుల సమీపంలో ఉంచకూడదు.
- పేలని పటాకులను మళ్లీ వెలిగించేందుకు ప్రయత్నించవద్దు.
- ఎమర్జెన్సీ ఎగ్జిట్ల వద్ద విద్యుద్దీపాలను అలంకరించకూడదు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు సులువుగా వీటిని ఉపయోగించుకునేలా ఉండాలి.












Click it and Unblock the Notifications