యూట్యూబర్ నందన దంపతులపై ప్రజావాణిలో బాధితుల ఫిర్యాదు
యూకేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలతో నమ్మించి నిరుద్యోగుల నుంచి భారీగా నగదు వసూలు చేసిన నేరంలో యూట్యూబర్ నందన, ఆమె భర్త మధుకర్ లపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే యూట్యూబర్ నందన దంపతులపై సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు బాధితులు క్యూ కట్టారు. తమకు న్యాయం చేయాలని అధికారులను బాధితులు కోరారు. ఈ మేరకు బేగంపేటలోని జ్యోతిబా ఫూలే ప్రజాభవన్ లో బాధితులు.. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్ పర్సన్, ప్రజావాణి ఇన్ ఛార్జి గద్వాల విజయలక్ష్మిని కలిసి తమ సమస్యను విన్నవించారు. యూకే ప్రభుత్వం తమ కన్సల్టెన్సీకి ఉద్యోగుల నియామక ప్రక్రియ కోసం అనుమతులు మంజూరు చేసిందని నందన, మధుకర్ దంపతులు తమను నమ్మబలికి కోట్లాది రూపాయలు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ముఖ్యంగా స్టూడెంట్, విజిటర్ వీసాలపై యూకేకు వెళ్లి, వీసా గడువు ముగియనున్న వారిని క్రమంగా లక్ష్యంగా చేసుకుని వర్క్ వీసాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారని ఫిర్యాదులో బాధితులు తెలిపారు. ఈ మేరకు ఒక్కొక్కరి నుంచి రూ. 25 లక్షల నుంచి రూ. 95 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే సదరు కన్సల్టెన్సీ సమర్పించిన పత్రాలు నకిలీవని తేలడంతో యూకే ప్రభుత్వం తమపై కఠిన చర్యలు తీసుకుందని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావాణికి ఫిర్యాదు చేసిన బాధితుల్లో తెలంగాణలోని వికారాబాద్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు తెలిపారు.

బాధితుల ఫిర్యాదులను స్వీకరించిన ప్రజావాణి ఇన్ ఛార్జి గద్వాల విజయలక్ష్మి, ఇతర అధికారులు.. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర డీజీపీ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టికి తీసుకెళ్లాలని అందుకు తమవంతు దర్యాప్తు చేసేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వరుస కేసులు ఎదుర్కొంటున్న యూట్యూబర్ నందన దంపతులకు ఇది బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఇక ఇటీవల శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో యూట్యూబర్ నందనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏపీలోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఇబ్రహీంపట్నం పోలీసులు విమానాశ్రయానికి వెళ్లి ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఆమెను విచారించి సమాచారం సేకరించి నోటీసులు ఇచ్చి వదిలిపెట్టిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications
