Loksabha election 2024: తెలంగాణలో వైసీపీ రీఎంట్రీ..ఖమ్మం గుమ్మంపై జగన్ గురి..!
2019 నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు మాత్రమే పరిమితమైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరిగి త్వరలో తెలంగాణలో అడుగుపెట్టేందుకు పావులు కదుపుతోందా..? ఏపీలో సంక్షేమం పూర్తిస్థాయిలో అందించిన వైసీపీ సర్కార్ ఇక తెలంగాణ పై ఫోకస్ చేసిందా..? తెలంగాణలో ఈ లోక్‌సభ ఎన్నికల ద్వారా రీఎంట్రీ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ ఏపీ సీఎం జగన్ వ్యూహం ఏంటి..? తెలంగాణలో మళ్లీ ఎందుకు ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఐతే నాడు తెలంగాణలో రాజకీయంగా అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ బలంగా కనిపించింది. రాష్ట్రం విడిపోయే సమయంలో టీడీపీ అధినేత రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటించారు. అయితే నాడు ఎంపీగా ఉన్న సీఎం జగన్ ఏపీ కోసం నిలిచారు. తన పార్టీ వైఖరి చాలా స్పష్టంగా చెప్పారు. అదే సమయంలో తెలంగాణకు అన్యాయం జరగకూడదని కూడా వెల్లడించారు. ఇక పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం అనంతరం అది ఆమోదం పొందడం ఆ పై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇక 2014లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పటికే తెలంగాణ వ్యాప్తంగా గులాబీ పార్టీ హవా కొనసాగుతోంది.

2014లో ఖమ్మంలో వైసీపీ..
బీఆర్ఎస్ స్వింగ్ తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్నప్పటికీ ఖమ్మం జిల్లాలో మాత్రం వైసీపీ మార్క్ కనిపించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 70 సీట్లను జగన్ నేతృత్వంలోని వైసీపీ పార్టీ గెలవగా అందులో 67 అసెంబ్లీ సీట్లు ఏపీ నుంచి 3 స్థానాలు తెలంగాణలో గెలుచుకుంది. ఈ మూడు స్థానాలు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైసీపీ నెగ్గింది.పినపాక నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్ పై పోటీచేసిన పాయం వెంకటేశ్వర్లు,వైరా నుంచి పోటీ చేసిన బానోతు మదన్‌లాల్,అశ్వారావు పేట నుంచి పోటీ చేసిన తాటి వెంకటేశ్వర్లు గెలిచారు. ఈ మూడు కూడా ఎస్టీ రిజర్వ్ స్థానాలు. ఈ మూడు అసెంబ్లీ సీట్లతో పాటు ప్రస్తుతం తెలంగాణ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి వైసీపీ టికెట్ పై పోటీ చేసి ఎంపీగా ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మొత్తంగా తెలంగాణలో 3.40 ఓటు శాతంను వైసీపీ నమోదు చేసింది.

ఖమ్మం నుంచి ఈ సారి...
ఇక తాజాగా ఏపీ సీఎం జగన్ తెలంగాణపై దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. గత కేసీఆర్ ప్రభుత్వంతో మంచి సత్సంబంధాలు నడిపారు సీఎం జగన్. అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టే వ్యూహంలో భాగంగా జగన్ పావులు కదుపుతున్నారా అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.ప్రస్తుతం అయితే వైసీపీ తనకు అచ్చొచ్చిన ఖమ్మం పార్లమెంట్ స్థానంపైనే ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే ఖమ్మం లోక్‌సభ స్థానంపై కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది. ఆ లోక్‌సభ స్థానంకు గట్టిగానే పోటీ ఉంది. కాంగ్రెస్ నుంచే ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు ఆ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. ఈ సమయంలో జగన్ పార్టీ ఎంట్రీతో ఖమ్మంలో సీన్ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఖమ్మంలో వైయస్ చరిష్మా
ఓ వైపు బీఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ పార్టీలు ఉండగా తాజాగా వైసీపీ ఎంట్రీ ఇస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం కలుగుతుందనే చర్చ ఖమ్మం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణలో జగన్ తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి ఇంకా అభిమానులు ఉన్నారు. షర్మిలా వైయస్సార్టీపీ పెట్టి ప్రజల్లో తిరిగినప్పటికీ ఆమె అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయారు. దీంతో పార్టీని ప్యాకప్ చేసి కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అనంతరం ఏపీ రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. అయితే జగన్‌కు తెలంగాణలో ఆ స్టామినా ఉందనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీపడుతున్న అభ్యర్థులు ఎవరికైనా ఆ పార్టీ నుంచి టికెట్ దక్కకపోతే మరో ప్రత్యామ్నాయ పార్టీగా వైసీపీ ఉండనే ఉంది. వైసీపీ నుంచి ఖమ్మం లోక్‌సభ స్థానానికి నిలబడే అభ్యర్థి కోసం జగన్ స్వయంగా వచ్చి ప్రచారం చేస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది.

మొత్తానికి ఖమ్మం పై దృష్టి సారించిన ఏపీ సీఎం జగన్.. ఒకవేళ ఆ సీటు తన ఖాతాలోకి వేసుకుంటే పార్టీని క్రమంగా తెలంగాణలో విస్తరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ దాదాపుగా ఖాళీ అయ్యింది. పేరుకు మాత్రమే టీడీపీ ఉన్నప్పటికీ ఆ పార్టీలో గుర్తింపున్న నాయకులు మాత్రం తెలంగాణలో కనిపించడం లేదు. దీంతో జగన్ పార్టీ తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications