కేసీఆర్.. భారీవరదల వల్ల కాళేశ్వరం మునిగితే, దేవాదుల ఎందుకు మునగలేదు: వైఎస్ షర్మిల సూటిప్రశ్న
తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కురిసిన వర్షాలు, వరదల నేపథ్యంలో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంపై అంతర్జాతీయ కుట్రలు జరుగుతున్నాయని చేసిన వ్యాఖ్యలపై ఆమె సెటైర్లు వేశారు.

కేసీఆర్ పై వైఎస్ షర్మిల వ్యంగ్యాస్త్రాలు
ఇంతకాలం ఆంధ్ర వాళ్ళ అణచివేతలు అయిపోయాయని, ప్రతిపక్షాల పన్నాగాలు అయిపోయాయని, తిరుగుబాటుదారుల వెన్నుపోట్లు అయిపోయాయని పేర్కొన్న వైయస్ షర్మిల రోజుకో రకం కారణం చెప్పి జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు జాతీయ పార్టీల జిమ్మిక్కులు అయిపోయాయని, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అయిపోయిందని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంపై అంతర్జాతీయ కుట్రలు మొదలయ్యాయి అని షర్మిల సెటైర్లు వేశారు. పాపం ఒక వరదకే ఎన్ని కష్టాలు వచ్చాయి మన కేసీఆర్ దొర గారికి అంటూ వైయస్ షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు

భారీ వరదల వల్ల కాళేశ్వరం మునిగితే, దేవాదుల ఎందుకు మునగలేదు?
అంతేకాదు భారీ వరదల వల్ల కాళేశ్వరం మునిగితే దేవాదుల ఎందుకు మునగ లేదంటూ వైయస్ షర్మిల కేసీఆర్ ను సూటి ప్రశ్న వేశారు. 18 ఏళ్ల క్రితం వైయస్ రాజశేఖర్ రెడ్డి కట్టిన దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ చెక్కుచెదరకుండా పని చేస్తుంటే, లక్షల కోట్ల అప్పు తెచ్చి మరీ కెసిఆర్ పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు లోని కన్నెపల్లి, అన్నారం పంప్ హౌస్ లు పట్టుమని రెండేళ్ళు కూడా కాకుండానే ఎందుకు మునిగిపోయాయని వైయస్ షర్మిల ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టటంలో డొల్లతనం బయట పడిందని షర్మిల పేర్కొన్నారు.

రికార్డు స్థాయిలో వచ్చిన వరదలు సైతం తట్టుకొని దేవాదుల నిలబడింది
13 లక్షల క్యూసెక్కుల వరదకు అన్నారం పంప్ హౌస్, 28 లక్షల క్యూసెక్కుల వరదకు కన్నెపల్లి పంప్ హౌస్ మునిగితే, 29.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా దేవాదుల పంప్ హౌస్ చెక్కుచెదర లేదని వైయస్ షర్మిల పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో వచ్చిన వరదలు సైతం తట్టుకొని దేవాదుల ఎత్తిపోతల నిలబడితే, కెసిఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టుల చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు, పంప్ హౌస్ లు చిన్నపాటి వరదకే తట్టుకోలేకపోయాయి అని ఎద్దేవా చేశారు

అనవసరమైన ఖర్చుకు, అవినీతికి నిదర్శనం కేసీఆర్ కాళేశ్వరం
సమర్ధత గల నాయకుని పనితీరుకు నిదర్శనం వైయస్ రాజశేఖర్ రెడ్డి దేవాదుల అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఇక అనవసరమైన ఖర్చుకు, అవినీతికి నిదర్శనం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు అంటూ వైయస్ షర్మిల మండిపడ్డారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రాజెక్ట్ ల నిర్మాణానికి, ప్రస్తుతం కేసీఆర్ హయాంలో ప్రాజెక్ట్ ల నిర్మాణానికి ఉన్న వ్యత్యాసం తెలియజేసేలా వైఎస్ షర్మిల ఆసక్తికర పోస్ట్ పెట్టారు.












Click it and Unblock the Notifications