కేసీఆర్ మాటల గారడీతో మోసం.. ప్రజలకు అరచేతిలో వైకుంఠం; తెలంగాణా ద్రోహి: వైఎస్ షర్మిల
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రస్థానం పాదయాత్రతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న వైఎస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ ను, కేంద్రంలోని అధికార బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలపై ఆమె తనదైన శైలిలో టార్గెట్ చేస్తున్నారు.

హామీలిచ్చి మాట తప్పిన కేసీఆర్ కు కాలం చెల్లింది
తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తాం అని సీఎం కేసీఆర్ చెప్పి మోసం చేశారని, తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని.. ఎంత మంది ఇళ్లల్లో ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని కెసిఆర్ హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని కేసీఆర్ నెరవేర్చలేదు అంటూ మండిపడ్డారు. ఇక రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పిన కెసిఆర్ కు కాలం చెల్లిందని వైయస్సార్టీపి అధ్యక్షురాలు వైయస్ షర్మిల స్థాయిలో విరుచుకుపడ్డారు.

కేసీఆర్ ది అసలు గుండెనా లేక బండనా?
ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె ప్రస్తుతం నారాయణపేట జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తూ వివిధ గ్రామాలలో ప్రజలతో నేరుగా మాట్లాడుతూ ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు, ప్రభుత్వ అసమర్థ పాలనపై ప్రజలకు అర్థమయ్యేలా చెబుతున్నారు. నిరుద్యోగులు, దళితులు, రైతులు, మహిళలకు హామీలు ఇచ్చి మాట తప్పిన కేసీఆర్ ది అసలు గుండెనా లేక బండనా అంటూ ప్రశ్నించారు వైయస్ షర్మిల. రైతుబంధు పథకాన్ని ఇస్తున్నాం అని చెప్పుకుంటున్న కేసీఆర్, రైతు బంధు ద్వారా ఐదు వేల రూపాయలు డబ్బులు ఇస్తే, అది బ్యాంకు వడ్డీలకు సరిపోవడం లేదని విమర్శించారు.

కెసిఆర్ మాటల గారడీతో ప్రజలను మోసం చేస్తున్నారు
ఎరువుల ధరలను పెంచి, సబ్సిడీలను ఎత్తివేసి రైతుల నడ్డి విరుస్తున్న కేసీఆర్ కు ప్రజలే బుద్ధి చెప్పాలని వైయస్ షర్మిల పేర్కొన్నారు. కెసిఆర్ మాటల గారడీతో ప్రజలను మోసం చేస్తున్నారని,పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని వైయస్ షర్మిల విమర్శించారు. ఇక ఇప్పటికే తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే లా మొదటి సంతకం చేస్తానని చెప్పిన షర్మిల, మరోమారు ఆ విషయాన్ని యువతకు గుర్తుచేస్తున్నారు. వైయస్సార్ బిడ్డగా తనను ఆదరిస్తే వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకువస్తానని వైయస్ షర్మిల హామీ ఇస్తున్నారు.

అరచేతిలో వైకుంఠం చూపే పాలన కెసిఆర్ ది
దళితులకు మూడెకరాల భూమి లేదు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ లేదు. రైతులకు రుణమాఫీ లేదు. దళిత ద్రోహి, మైనార్టీ ద్రోహి, రైతు ద్రోహి, మొత్తంగా తెలంగాణా ద్రోహి కేసీఆర్ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కెసిఆర్ పాలన ఎంత దరిద్రంగా ఉందో ప్రజలే చెప్తున్నారు. అరచేతిలో వైకుంఠం చూపే పాలన కెసిఆర్ ది అంటూ షర్మిల నిప్పులు చెరిగారు. ప్రజలను గాలికొదిలి,ఫామ్ హౌజ్‌కే పరిమితమై, బంగారు తెలంగాణ చేశానని భోగాలు అనుభవిస్తున్నాడు అంటూ విమర్శించారు.ఎనిమిదేండ్ల పాలనలో కెసిఆర్ ఏనాడైనా ప్రజలతో మాట్లాడారా? సమస్యలు తెలుసుకున్నారా? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications