రాష్ట్రాన్ని శవాలదిబ్బ చేసి జాతీయపార్టీ పెడతారా? ఆత్మహత్యలు కేసీఆర్ రాతిగుండెకు పట్టవా? వైఎస్ షర్మిల
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఈ పాదయాత్రలో భాగంగా దేవరకద్రలో పర్యటిస్తున్న వైయస్ షర్మిల వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలన పై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణాలో సీఎం కేసీఆర్ కు ప్రత్యామ్నాయం తామేనని చెప్తున్న షర్మిల బీజేపీ, కాంగ్రెస్ లపైన కూడా విరుచుకుపడుతున్నారు.

రాష్ట్రాన్ని శవాల దిబ్బ చేసి జాతీయ పార్టీ పెట్టేందుకు విధి విధానాలా ?
తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణగా మార్చారు అని చెప్పుకుంటున్నారని పేర్కొన్న షర్మిల బంగారు తెలంగాణ ఎక్కడ అయ్యిందో చూపించాలి అంటూ ప్రశ్నించారు. నిరుద్యోగుల ఆత్మబలిదానాల మీద సీఎం అయిన కేసీఆర్, రాష్ట్రాన్ని శవాల దిబ్బ చేసి జాతీయ పార్టీ పెట్టేందుకు విధివిధానాలు రూపొందిస్తున్నారట అంటూ ఎద్దేవా చేశారు. 50 రోజులుగా పేస్కేల్ అమలు చేయాలని దీక్షలు చేస్తూ 29 మంది వీఆర్ఏ లు ఆత్మహత్యలు చేసుకొని, జీతాలు రాక గుండెలు ఆగిపోయి చనిపోతుంటే కేసీఆర్ దొరకు అవేవి పట్టడం లేదని వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు.

వీఆర్ఏ ల ఆత్మహత్యలు కెసీఆర్ రాతి గుండెకు పట్టవా
నిన్న నల్లగొండలో వీఆర్ఏ వెంకటేశ్వర్లు, ఇవ్వాళ కామారెడ్డిలో వీఆర్ఏ రవి జీతాలు రాక లోన్లు కట్టలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని, రాష్ట్రంలో రోజుకో రైతు, రోజుకో వీఆర్ఏ ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నా, తెలంగాణ బొందల గడ్డ అవుతున్న కెసిఆర్ రాతి గుండెకు పట్టడం లేదని వైయస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ పాలనలో రుణమాఫీ లేదు. ఫీజు రీయింబర్స్ మెంట్ లేదు. పక్కా ఇండ్లు లేవు. ఆరోగ్యశ్రీ లేదు. ఉద్యోగాలు లేవు. పోడు పట్టాలు లేవు. మహిళలకు రుణాలు లేవు అని మండిపడ్డ షర్మిల, కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఎన్నో పథకాలను అటకెక్కించాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బంగారు తెలంగాణా అయ్యింది కేసీఆర్ కుటుంబానికే, ప్రజలకు కాదు
అసలు తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ సాధించిన ప్రగతి ఏంటో చూపించాలని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలందరూ తీవ్రమైన బాధలతో, అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక, రైతులకు రుణమాఫీ అందాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. కేవలం బంగారు తెలంగాణ అయింది కెసిఆర్ కుటుంబానికి మాత్రమేనని వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ సంక్షేమ పాలన సాధించి, మళ్లీ మంచి రోజులు తీసుకురావడమే మా లక్ష్యం అని అందుకే వైయస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటైందని వైయస్ షర్మిల స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications