రేపు వనపర్తి జిల్లాకు వైఎస్ షర్మిల: తాడిపర్తిలో నిరుద్యోగ నిరాహార దీక్ష షురూ
వనపర్తి: తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.. జనం బాట పట్టింది. నియోజకవర్గ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలకు తెర తీసింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్‌ను సాధించడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాల నియామక ప్రక్రియను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షలకు దిగనుంది. ఇదివరకు- జాబ్ నోటిఫికేషన్ కోసం పార్టీ అధి నాయకురాలు వైఎస్ షర్మిల చేసిన 72 గంటల నిరాహార దీక్షను కొనసాగించాలని వైఎస్సార్టీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా- ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష పేరుతో ఆందోళనా కార్యక్రమాలను చేపట్టనుంది.

లక్షా 90 వేల ఉద్యోగాల భర్తీ కోసం..
ఈ ఆందోళన కార్యక్రమాన్ని వైఎస్ షర్మిల మంగళవారం ప్రారంభించనున్నారు. వనపర్తి జిల్లా తాడిపర్తిలో దీన్ని ప్రారంభిస్తారు. అక్కడే నిరాహర దీక్ష చేస్తారు. తెలంగాణలో వేర్వేరు శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియను చేపట్టడం, ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ప్రకటించిన 50 వేల ఖాళీల భర్తీ నోటిఫికేషన్‌ను వెంటనే ప్రకటించాలనేది వైఎస్ షర్మిల ప్రధాన డిమాండ్.

వనపర్తి పర్యటన రూట్ మ్యాప్ ..
వైఎస్ షర్మిల నిర్వహించ తలపెట్టిన వనపర్తి జిల్లా పర్యటనకు సంబంధించిన రూట్‌మ్యాప్‌ను పార్టీ నాయకులు విడుదల చేశారు. దీనిప్రకారం- మంగళవారం తెల్లవారు జామున 6 గంటలకు షర్మిల లోటస్‌పాండ్‌లోని నివాసం నుంచి రోడ్డు మార్గంలో వనపర్తికి బయలుదేరుతారు. 6:15 నిమిషాలకు శంషాబాద్, 7 గంటలకు జడ్చర్ల చేరుకుంటారు. 7:25 నిమిషాలకు జడ్చర్ల నుంచి కొత్తకోట, 7:35 నిమిషాలకు వనపర్తికి చేరుకుంటారు. అక్కడ పార్టీ నాయకులు, జిల్లా సమన్వయకర్తలను కలుసుకుంటారు. అనంతరం తాడిపర్తికి వెళ్తారు. వనపర్తి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడిపర్తికి ర్యాలీగా బయలుదేరి వెళ్తారు.

నిరుద్యోగ యువత తరఫున..
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు నివాళి అర్పిస్తారు. తాడిపర్తిలో నిరుద్యోగ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దీక్షలో కూర్చుంటారు. ఆమెతో పాటు పార్టీ నాయకులు కొండా రాఘవరెడ్డి, పిట్ట రాంరెడ్డి, ఇందిరా శోభన్, ఏపూరి సోమన్న నిరాహార దీక్షలో పాల్గొంటారు. నిరుద్యోగుల తరఫున వైఎస్ షర్మిల ముందు నుంచీ పోరాటాన్ని సాగిస్తోన్నవిషయం తెలిసిందే. ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి, నిరాశతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటోన్నారని ఆమె విమర్శిస్తోన్నారు. నిరుద్యోగ యువత తరఫున తాము పోరాడుతోన్నామని ప్రకటించారు.
Recommended Video

హుజూరాబాద్ ఉప ఎన్నిక స్టంట్‌గా..
ఆత్మహత్యలు చేసుకుంటే గానీ కేసీఆర్‌కు తన కర్తవ్యం గుర్తుకు రావట్లేదంటూ మండిపడ్డారు. ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటావు దొరా అంటూ వైఎస్ షర్మిల సూటిగా ప్రశ్నిస్తోన్నారు. ఇప్పటికే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటోన్నారని, అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగాలు రావట్లేదని మనస్తాపంతో ఎంతో మంది నిరుద్యోగులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ తీరిగ్గా కేసీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారని, అది హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక స్టంట్ అని రాష్ట్ర ప్రజలకు తెలుసంటూ చురకలు అంటించారు. జోనల్ సిస్టమ్ వల్లే ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో జాప్యం చోటు చేసుకుందని చెప్పడంలో అర్థం లేదని విమర్శించారు.












Click it and Unblock the Notifications