రేపు హన్మకొండకు వైఎస్ షర్మిల: నిరాహార దీక్ష వేదిక అక్కడే
హన్మకొండ: ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్‌ను సాధించడాన్ని లక్ష్యంగా చేసుకుని జనం బాట పట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. ఈ మంగళవారం హన్మకొండ పర్యటించనున్నారు. హన్మకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్‌లో ఆమె నిరుద్యోగ నిరాహార దీక్షకు కూర్చోనున్నారు. ఈ నిరహార దీక్షకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా సమన్వయ కమిటీ నాయకులు పర్యవేక్షిస్తోన్నారు. కరోనా వైరస్ ప్రొటోకాల్స్ అనుగుణంగా దీన్ని నిర్వహిస్తామని వైఎస్సార్టీపీ నేతలు చెప్పారు.
ఇదివరకు- తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్ కోసం వైఎస్ షర్మిల చేసిన 72 గంటల పాటు నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ప్రతి మంగళవారం దీక్ష కొనసాగించేలా నిరుద్యోగ నిరాహర దీక్ష ఆందోళనను చేపట్టారామె. ప్రతి మంగళవారం ఎంపిక చేసిన జిల్లాలో 12 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తూ వస్తోన్నారు. తొలిసారిగా కిందటి నెల 13వ తేదీన వనపర్తి జిల్లా తాడిపర్తిలో నిరుద్యోగ నిరాహార దీక్షను ప్రారంభించారు.

తెలంగాణలో వేర్వేరు శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియను చేపట్టడం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకు ప్రకటించిన 50 వేల ఖాళీలను భర్తీ చేయడానికి ఉద్దేశించిన నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలనేది వైఎస్ షర్మిల ప్రధాన డిమాండ్. ఈ నిరుద్యోగ నిరాహార దీక్ష ప్రధాన ఉద్దేశం అదే. వనపర్తి జిల్లాలో నిరుద్యోగ నిరాహార దీక్షను చేపట్టిన తరువాత వైఎస్ షర్మిల కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, సిద్ధిపేట్, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లో ప్రతి మంగళవారం నిరాహార దీక్షను చేపడుతున్నారు.
ఈ సారి ఆమె హన్మకొండ హయగ్రీవాచారి గ్రౌండ్‌లో నిరుద్యోగ నిరాహార దీక్షలో కూర్చోనున్నారు. 12 గంటల పాటు ఈ దీక్ష కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఆమె వెంట వైఎస్సార్టీపీ నాయకులు పిట్ట రాంరెడ్డి, ఏపూరు సోమన్న, కొండా రాఘవరెడ్డి తదితరులు ఉంటారు. హన్మకొండ జిల్లా పార్టీ కోఆర్డినేటర్లు ఈ దీక్షకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తోన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోటస్‌పాండ్‌లోని తన నివాసం నుంచి ఉదయం 6 గంటలకు రోడ్డు మార్గంలో హన్మకొండకు చేరుకుంటారు.
Recommended Video
మార్గమధ్యలో- దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు నివాళి అర్పిస్తారు. అనంతరం ఉదయం 10 గంటల కల్లా హయగ్రీవాచారి మైదానానికి చేరుకుని, దీక్ష చేపడతారు. రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య, ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కాకపోవడం వల్ల యువత ఆత్మహత్యకు పాల్పడుతున్న విషయాలపై ప్రసంగిస్తారు. దళిత బంధు అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications