ఢిల్లీలో వైఎస్ షర్మిల అరెస్ట్: వేల కోట్ల అవినీతిపై ధర్నా, విచారణకు డిమాండ్
తెలంగాణ ప్రభుత్వం చేసిన అవినీతి ప్రాజెక్టులపై విచారణ జరిపించాలంటూ దేశ రాజధానిలోని జంతర్‌మంతర్ వద్ద వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరసన చేపట్టారు.
ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం చేసిన అవినీతి ప్రాజెక్టులపై విచారణ జరిపించాలంటూ దేశ రాజధానిలోని జంతర్‌మంతర్ వద్ద వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. 'కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో' అంటూ నినాదాలు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద స్కాం అంటూ షర్మిల
అంతకుముందు వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, దీనిపై సీబీఐ, ఈడీలతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారించాలని కోరారు.కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ వేల కోట్ల కమీషన్లు దండుకున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. రీ డిజైనింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును మూడు రెట్లు వ్యయం పెంచారన్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రజల సొమ్ము లక్షల కోట్లను కేసీఆర్ దోచుకున్నారన్నారు. 38 వేల కోట్ల ప్రాజెక్టును ఒక లక్షా 50 వేల కోట్లకు పెంచారని, మూడు సార్లు ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని పెంచారన్నారు.

దేశ ప్రజలను మోసం చేశారంటూ కేసీఆర్‌పై షర్మిల ఫైర్
ప్రాజెక్టు వల్ల చాలా మంది నిరాశ్రులయ్యారని, వారికి ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయలేదని షర్మిల తెలిపారు. నాణ్యత లేకుండా ప్రాజెక్టు కట్టారని, ప్రతి ఏటా వేల ఎకరాల పంట పొలాలు మునిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అద్భుతమంటూ కేసీఆర్ తెలంగాణతో పాటు దేశ ప్రజలను కూడా మోసం చేశారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు నిర్మాణంలో రూ.70 వేల కోట్ల అవినీతి జరిగిందనీ, 2జీ, బొగ్గు కుంభకోణం కంటే.. ఇది పెద్ద స్కామ్ అని షర్మిల ఆరోపించారు.
ఢిల్లీలో షర్మిల అరెస్ట్
ప్రాజెక్టు రీ డిజైనింగ్ పేరుతో లక్షా 20 వేల కోట్ల ఖర్చుతో కేవలం 18 లక్షల 25 వేల 700 ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చేలా నిర్మించారని వైఎస్ షర్మిల తెలిపారు. ఇంత ఖర్చు చేసి కేవలం లక్షా 50 వేల ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇచ్చారని చెప్పారు. పంప్ హౌజ్‌ల ఎత్తు కూడా చూసుకోకుండా కట్టారని, నాసిరకం పనులు చేశారని ఆరోపించారు. నిర్మాణ పనులపై ఆడిట్ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయడానికే పవర్ బిల్ రూ.3 వేల కోట్లు ఖర్చయిందని, లోన్లకు వడ్డీలే రూ.13 వేల కోట్లు కడుతున్నారని తెలిపారు. కాగా, ధర్నా తర్వాత ఛలో పార్లమెంటులో భాగంగా వెళుతుండగా.. ఢిల్లీ పోలీసులు షర్మిలను, వైయస్సార్టీపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వైయస్సార్టీపీ శ్రేణులు, పోలీసులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.












Click it and Unblock the Notifications