మందకృష్ణ మాదిగ ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల: ఆరోగ్యంపై ఆరా: తుంగతుర్తి సభకు ఆహ్వానం..
హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల.. ఈ ఉదయం హైదరాబాద్ విద్యానగర్‌కు వచ్చారు. నిరుద్యోగ నిరాహార దీక్ష పేరుతో రెండు నెలలుగా ప్రతి మంగళవారం ఒక్కో జిల్లాలో ఆందోళన కార్యక్రమాలను చేపడుతోన్న వైఎస్ షర్మిల.. హఠాత్తుగా విద్యానగర్‌లో కనిపించారు. ఈ మంగళవారం మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయం వద్ద నిరుద్యోగ నిరాహార దీక్షను చేపట్టిన ఆమె అదే రోజు రాత్రి లోటస్ పాండ్ నివాసానికి చేరుకున్నారు.
ఈ ఉదయం విద్యానగర్‌లో- మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఇంటికి వెళ్లారు. మందకృష్ణ మాదిగ విద్యానగర్‌లో నివసిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఉదయం వైఎస్ షర్మిల.. తన పార్టీ నాయకులు పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న, ఇతరులతో కలిసి మందకృష్ణ మాదిగ నివాసానికి చేరుకున్నారు. ఆయనను పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని అకాంక్షించారు. మళ్లీ ఇదివరకట్లా రాజకీయాల్లో క్రీయాశీలకం కావాలని కోరారు.

ఈ ఆదివారం నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరిలో నిర్వహించ తలపెట్టిన దళిత భేరి బహిరంగ సభకు హాజరు కావాలని ఆహ్వానించారు. దళితుల పక్షాన తాము చేస్తోన్న పోరాటానికి మద్దతుగా నిలవాలని మందకృష్ణ మాదిగకు విజ్ఞప్తి చేశారు. మందకృష్ణ మాదిగ కొద్దిరోజుల కిందట గాయపడిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఓ హోటల్ బాత్‌రూమ్‌లో ఆయన జారిపడ్డారు. ఈ ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. అనుచరులు ఆయనను ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. శస్త్ర చికిత్స చేశారు.

అక్కడ చికిత్స పొందారు. ఆరోగ్యం కుదుట పడటంతో ఇటీవలే మందకృష్ణ మాదిగ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. విద్యానగర్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటోన్నారు. అప్పట్లో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి.. ఆయనకు దగ్గరుండి వైద్య సహాయాన్ని అందించినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు ఆరోగ్య స్థితిగతుల గురించి ఆరా తీసినట్లు సమాచారం. మందకృష్ణ డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన విషయం తెలియడంతో వైఎస్ షర్మిల ఆయనను పరామర్శించారు.
ఇదిలావుండగా- వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఈ ఆదివారం వైఎస్సార్ దళిత భేరి పేరుతో బహిరంగ సభను నిర్వహించనుంది. నల్లగొండ జిల్లాలోని తిరుమలగిరి మండల కేంద్రంలో ఈ సభను నిర్వహించ తలపెట్టింది. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సభ పోస్టర్‌ను పార్టీ నాయకుడు ఏపూరి సోమన్న ఇదివరకే లోట్‌స్‌పాండ్‌లో ఆవిష్కరించారు. వైఎస్ షర్మిల సహా పలువురు ప్రముఖులు ఈ బహిరంగ సభకు హాజరు కానున్నారు. రాజకీయాలకు అతీతంగా తాము ఈ సభను నిర్వహించనున్నట్లు వైఎస్సార్టీపీ తెలిపింది.

నిరుద్యోగ నిరాహార దీక్షలను కొనసాగిస్తూనే.. దళితుల తరఫున పోరాటాలను వైఎస్సార్టీపీ ఉధృతం చేయబోతోంది. ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ప్రతి మంగళవారం వైఎస్ షర్మిల- ఒక్కో జిల్లాలో ఈ నిరాహార దీక్షలను చేపడుతూ వస్తోన్నారు. దీనికితోడు ఇక దళితుల కోసం కూడా ప్రతి వారం జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని భావిస్తోంది. తుంగతుర్తి సభ తరువాత దీని మీద ఓ సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టినట్టే.. వారంలో ఒకరోజును దళిత ఉద్యమాల కోసం కేటాయిస్తారని అంటున్నారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అమలు చేస్తోన్న దళితబంధు పథకాన్ని కేంద్రబిందువుగా చేసుకుని వైఎస్ షర్మిల తన పోరాటాన్ని సాగిస్తారని అంటున్నారు. ఇప్పటికే- ఈ పథకాన్ని కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు టార్గెట్‌గా చేసుకున్నాయి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో సభ సైతం నిర్వహించారు.












Click it and Unblock the Notifications