మళ్లీ ఢిల్లీకి షర్మిల-గన్ మెన్ లేకుండా భర్తతో-కాంగ్రెస్ విలీనం ఫైనల్ అయ్యే ఛాన్స్ !
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ మరోసారి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీని విలీనం చేయాలని నిర్ణయించుకున్న షర్మిల.. ఇప్పటికే పలుమార్లు ఆ పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపారు. ఇప్పుడు మరోసారి ఇదే అంశంపై చర్చలు జరిపేందుకు ఢిల్లీ చేరుకున్నారు. అయితే గత పర్యటనలకు భిన్నంగా ఈసారి కుటుంబంతో కలిసి ఆమె ఢిల్లీ వెళ్లారు. అలాగే గన్ మెన్లను కూడా తోడు తీసుకెళ్లలేదు. పార్టీ వర్గాలు మాత్రం ఇది ఆమె వ్యక్తిగత టూర్ అని చెప్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీని విలీనం చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్న వైఎస్ షర్మిల ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానంతో జరిపిన చర్చల్లో కాస్త పురోగతి వచ్చినా ఓ అంశంలో మాత్రం డెడ్ లాక్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్టీపీ విలీనం తర్వాత ఏపీకి వెళ్లి పార్టీ బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ ఆమెకు ఆఫర్ చేస్తుండగా.. షర్మిల మాత్రం తెలంగాణలో కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో టీకాంగ్రెస్ నేతలు ఆమె చేరికకు అడ్డుచెబుతున్నారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉంది. ఈ తరుణంలో వైఎస్ షర్మిల చేరిక తమకు ఇబ్బందిగా మారుతుందని టీకాంగ్రెస్ నేతలు అధిష్టానానికి చెబుతున్నారు. కానీ షర్మిల మాత్రం తెలంగాణ నుంచే తాను రాజకీయం మొదలుపెట్టాను కాబట్టి ఇక్కడే కొనసాగుతానని అంటున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయంపై ఎటూ తేల్చుకోలేక గతంలో చర్చలు వాయిదా వేసింది. ఇప్పుడు మరోసారి కుటుంబంతో కలిసి కాంగ్రెస్ పెద్దల్ని కలిసేందుకు షర్మిల వెళ్లారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ షర్మిల సేవల్ని ఎలా వాడుకోవాలనుకుంటున్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో ఎప్పుడు విలీనం చేసుకోవాలన్న దానిపైనా స్పష్టత రానుంది. ఆ తర్వాత షర్మిల స్వయంగా దీనిపై ఓ ప్రకటన చేసే అవకాశముందని చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ లో చేరిపోయినా తెలంగాణ రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కష్టం కాబట్టి ఆమెకు ఏపీకి వెళ్లమని అధిష్టానం కోరుతోంది. మరో ఆప్షన్ లేకపోతే మాత్రం కాంగ్రెస్ పెద్దలకు షర్మిల గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసే అవకాశాలూ లేకపోలేదు.












Click it and Unblock the Notifications