పీకేయాల్సింది కేసీఆర్ ఉద్యోగం-ఆ మాట నిలబెట్టుకున్నాడా-వాళ్ల ఉసురు తగలుతుంది.. : వైఎస్ షర్మిల
ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఇవ్వని కేసీఆర్‌కు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తీసే హక్కు ఎక్కడిదని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్ట్ ఉద్యోగం అనే మాట వినిపించదని చెప్పిన కేసీఆర్.. ఆ మాట నిలబెట్టుకున్నాడా అని ప్రశ్నించారు. తొలగించిన 7561 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే 18 నెలలుగా వారికి రావాల్సిన జీతాన్ని లెక్కగట్టి ఇవ్వాలన్నారు. ఇప్పటివరకూ 50 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఆత్మహత్య చేసుకున్నారని.. వారి స్థానంలో కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలన్నారు. ప్రజల గురించి పట్టించుకోని కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవిలో ఉండే అర్హత లేదన్నారు. ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలన్నారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బుధవారం(ఆగస్టు 11) కాంట్రాక్ట్ ఉపాధి హామీ ఫీల్డ్ వర్కర్లు చేపట్టిన ధర్నాలో షర్మిల పాల్గొన్నారు.

ఈ రాష్ట్రంలో ఎవరైనా సంపాదించుకున్నారంటే అది...
'ఇక్కడ ఒక్కొక్కరి కథ విన్నాం మనం. ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేసి ఉద్యోగాలు కోల్పోవడంతో కొంతమంది ప్రాణాలు విడిచారు. ఉద్యోగం పోయిందని తన భర్త గుండెపోటుతో చనిపోయాడని ఒక చెల్లి చెప్పింది. ఇంకొకామె భర్తను పోగొట్టుకున్నది,బిడ్డకు కడుపులో ఆపరేషన్ చేయించాల్సి వచ్చి రెండెకరాల భూమిని తాకట్టు పెట్టింది. ఆరోగ్యశ్రీ పథకం లేక ఉన్న భూమిని అమ్ముకున్నది. ఫీల్డ్ అసిస్టెంట్లు బాగా సంపాదించుకున్నారని చెబుతున్నారు... ఒకసారి మా ఇళ్లకు వచ్చి చూస్తే తెలుస్తుంది... మేము సంపాదించుకున్నామో లేదో అని వీళ్లు చెబుతున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరైనా సంపాదించుకున్నారంటే అది కేసీఆర్ కుటుంబం మాత్రమే.కాళేశ్వరం ప్రాజెక్ట్,మిషన్ భగీరథ ద్వారా రూ.వేల కోట్ల కమిషన్లు మింగారు.' అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

అన్నీ కేసీఆర్ కుటుంబానికే దక్కాయి...
'తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో నీళ్లు,నిధులు,నియమాకాలు... అన్నీ కేసీఆర్ ఇంటికే,కేసీఆర్ కుటుంబానికే దక్కాయి. కొత్త ఉద్యోగం ఒక్కటి ఇవ్వడం చేతకాదు. ఉన్న ఉద్యోగాలకే భరోసా కల్పించలేని నాయకుడు.ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడిపోతుందో తెలియని పరిస్థితుల్లో ఉద్యోగులు అభద్రతలో ఉన్నారు. 18 నెలల క్రితం 7561 ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. ఏం తప్పు చేశారని వారిని తొలగించారు. సమ్మె చేయడం వారి తప్పా. రూ.9వేల నెల జీతంతో ఎలా బతికేది అని ప్రశ్నించడం తప్పా.. ఈ కాలంలో ఇంత తక్కువ జీతంతో కుటుంబానికి ఎలా గడవాలి. ఉద్యోగభద్రత కల్పించాల్సింది పోయి ఉన్న ఉద్యోగాలు కూడా పీకేశారు కేసీఆర్. ఆయన ఛాతిలో ఉన్నది గుండెనా... లేక బండనా... ఒకప్పుడు కేసీఆర్ కేంద్రంలో కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. కార్మికుల అవసరాలు... ఎంత జీతమిస్తే సరిపోతుందో ఆయనకు తెలియదా. ఒక ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో పనిచేస్తున్నవారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత లేదా... జీతాలు సరిపోతున్నాయా లేదా చూడాల్సిన అవసరం లేదా... సమ్మె చేసి గుర్తు చేస్తే ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తారా.' అని షర్మిల ప్రశ్నించారు.

పీకాల్సింది కేసీఆర్ ఉద్యోగం..
తెలంగాణలో పీకాల్సింది కేసీఆర్ ఉద్యోగం. ప్రజల గురించి ఆలోచించని ముఖ్యమంత్రి గారికి ఆ పదవి అవసరం లేదు. ప్రశ్నించినందుకే వారిని రోడ్డునపడేశారు. ప్రశ్నించడమే తెలంగాణ సిద్దాంతం... తెలంగాణ నినాదం,విధానం... అది మరిచిపోయి ప్రశ్నించే గొంతులను అణదొక్కుతున్నారు. ఎవరూ ప్రశ్నించకూడదు,వేలెత్తిచూపకూడదు అనుకుంటున్నారు.ఆర్టీసీ ఎంప్లాయిస్ సమ్మె చేస్తే వారిని అరిగోస పెట్టి వారి చావులకు కారణమయ్యారు. సంఘాలను నిర్వీర్యం చేశారు.ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు వారు బతుకుతున్నారు. అయినా కేసీఆర్‌ను ప్రశ్నించట్లేదు. ఎందుకంటే ఉద్యోగాలు తీస్తారేమోనని భయం. ఆయన ఇచ్చింది తీసుకోవాలి.. కిక్కురుమనకుండా ఉండాలి. కరోనా సమయంలో 1600 మంది నర్సులను రాత్రికి రాత్రే ఉద్యోగాల్లో నుంచి పీకేశారు. 675 మంది నర్సింగులను సెలక్ట్ చేసి పోస్టులు ఇవ్వకుండా సతాయిస్తున్నారు. ఇప్పటికీ 52వేల ఉద్యోగాలు పీకేశారు. ఏం పాపం చేశారని ఇన్నికుటుంబాలను రోడ్డున పడేశారు.' అని షర్మిల కేసీఆర్‌ను నిలదీశారు.

నియంతలా పాలిస్తున్నాడు కేసీఆర్...
'ఒకప్పుడు వైఎస్సార్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే అవకాశం ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు తెలంగాణ ఎంత దుస్థితిలో బతుకుతోంది. ఈరోజు కేసీఆర్ అపాయింట్‌మెంట్ కావాలంటే మంత్రులు,ఎమ్మెల్యేలకే అవకాశం లేదు. పెద్ద దొర,చిన్న దొర పర్యటనకు వస్తున్నారంటే రెండు రోజుల ముందే అరెస్టులు చేస్తున్నారు. హాలియా సభలో మహిళలని కూడా చూడకుండా... కుక్కల్లా ఎందుకు మొరుగుతున్నారని కేసీఆర్ వారిని అవహేళన చేశాడు.ప్రశ్నిస్తే ఎందుకంత అసహనం.ప్రజలు మీకు బానిసలు అనుకుంటున్నారా.కేసీఆర్ ఒక నియంతలా పాలిస్తున్నారు. కేసీఆర్ మా నాయకుడు అని చెప్పుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చింది. 7561 మందికి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలిచ్చింది వైఎస్సార్. ప్రశ్నించేవాళ్లు లేరనుకుంటున్నారా... రాజన్న బిడ్డ వచ్చింది.. ప్రశ్నిస్తాం... ప్రజల పక్షాన నిలబడుతాం... ఉపాధి హామీ,ఫీజు రీయింబర్స్,ఆరోగ్యశ్రీ,నిరుద్యోగులు,రైతుల కోసం పోరాటం చేస్తాం.' అని షర్మిల తెలిపారు.

ఈ పాపమంతా కేసీఆర్‌దే... ఉసురు తగలుతుంది...
'2009లో కాంట్రాక్ట్ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలు రూ.9వేలు చేసింది వైఎస్సార్. ఆ తర్వాత వచ్చినవాళ్లెవరూ వారిని పట్టించుకోలేదు. దాదాపు 1కోటి 20లక్షల మందికి ఉపాధి హామీ పని చూపించేది ఫీల్డ్ అసిస్టెంట్లు. వారికి 15ఏళ్ల అనుభవం ఉంది. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచమని అడిగినందుకే వారిని తొలగించారు. ఏం తక్కువైందని ఎమ్మెల్యేలకు లక్షలకు లక్షలు జీతాలు పెంచారు. తెలంగాణ బంగారు తునక,ధనిక రాష్ట్రం అని చెబుతున్నారు... వాళ్లేమైనా రూ.9వేల జీతాలను లక్షలు లక్షలు పెంచమన్నారా. మీరేమైనా మీ ఇంట్లో నుంచి కంపెనీలో నుంచి తెచ్చి ఇస్తున్నారా. కరోనా సమయంలో ఎలా బతుకుతారనే కనీస ఆలోచన లేకుండా వారిని ఉద్యోగాల్లో నుంచి తీసేశారు. 18 నెలలుగా ఉపాధి లేక వారు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఇప్పటికే 50 మంది చనిపోయారు. ఈ పాపమంతా కేసీఆర్‌దే... ఈ ఉసురు కేసీఆర్‌కు తగలదా.. ఏం మనిషండి కేసీఆర్.' అని షర్మిల విరుచుకుపడ్డారు.

ఆ మాట నిలబెట్టుకున్నాడా...
'తెలంగాణ రాష్ట్రమొస్తే కాంట్రాక్ట్ ఉద్యోగం అనే మాటే ఉండదన్నాడు కేసీఆర్.ఆ మాట నిలబెట్టుకున్నాడా. 7561 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రతీ ఒక్కరినీ మళ్లీ ఉద్యోగాల్లో నియమించమని డిమాండ్ చేస్తున్నాం. 18 నెలల వారి జీతాన్ని లెక్కగట్టి చేతిలో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఆత్మహత్యలు చేసుకున్న లేదా మరణించిన ఫీల్డ్ అసిస్టెంట్ల స్థానంలో వారి భార్యలు లేదా కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తున్నాం.కేసీఆర్ మాయల మరాఠీ హామీలు ఇక చెల్లవు. ప్రజల పక్షాన ప్రతీ సమస్యలో నిలబడి పోరాడుతాం. ఎవరూ అధైర్యపడవద్దు. ఇంకొన్ని రోజులు ఓపికపట్టండి.రాబోయే వైఎస్సార్‌టీపీ ప్రభుత్వంలో మీ ఉద్యోగాలకు ఢోకా ఉండదని మాట ఇస్తున్నాను. ఆత్మహత్య చేసుకున్న ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25వేలు పార్టీ తరుపున అందజేస్తాం.' అని షర్మిల ప్రకటించారు.












Click it and Unblock the Notifications