తిరుమలలో నాపై టీటీడీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు - నటి: అందిపుచ్చుకున్న టీడీపీ..!!
తిరుపతి: టీటీడీ ఉద్యోగులు తనపై దురుసుగా ప్రవర్తించినట్లు నటి, ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ నాయకురాలు అర్చన గౌతమ్ ఆరోపించారు. ఈ మేరకు ఆమె తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌పై ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశారు. టికెట్లపై తనకు పూర్తి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. దర్శనం టికెట్లు మంగళవారం లభిస్తాయని తనకు ముందుగా చెప్పలేదని ఆరోపించారు. ఇవ్వాళ టికెట్ల ఇవ్వడానికి అంగీకరించట్లేదని చెప్పారు.
ఇప్పటికప్పుడు టికెట్ ఇవ్వాలంటే 10,500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోన్నారని విమర్శించారు. అదేమంటూ నిలదీసిన తనపై సిబ్బంది దురుసుగా ప్రవర్తంచారని, తనను బయటికి నెట్టడానికి ప్రయత్నించారని కన్నీటిపర్యంతం అయ్యారు. తనపై దురుసుగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈవో ఛాంబర్‌లో ఆమె సెల్ఫీ వీడియో తీయడానికి ప్రయత్నించగా.. అక్కడి సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు.

దేశంలో హిందూ ధార్మిక స్థలాలన్నీ దోపిడీకి అడ్డాగా మారాయని అర్చన గౌతమ్ తన ట్విట్టర్‌లో రాశారు. టీటీడీ సిబ్బంది మహిళలను అభద్రత భావానికి గురి చేస్తోన్నారని ధ్వజమెత్తారు. వీఐపీ దర్శన్ పేరుతో ఒక్కొక్కరి నుంచి 10,500 రూపాయలను వసూలు చేస్తోన్నారని ఆరోపించారు. అర్చన గౌతమ్ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తినాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, ఓడిపోయారు.
भारत के हिंदू धर्म स्थल लूट का अड्डा बन चुके हैं धर्म के नाम पर तिरुपति बालाजी मैं महिलाओं के साथ अभद्रता करते,यह टीटीडी के कर्मचारी पर कार्यवाही होनी चाहिए । मैं आंध्र गवर्नमेंट से निवेदन करती हूं।ओर यह VIP दर्शन के नाम पर 10500 एक आदमी से लेते है । इसे लूटना बंद करो । @INCIndia pic.twitter.com/zABFlUi0yL
— Archana Gautam (@archanagautamm) September 5, 2022
దీనిపై టీటీడీ అధికారులు వివరణ ఇచ్చారు. ఓ రాజకీయ నాయకుడి సిఫారసు లేఖను ఆమె తన వెంట తెచ్చుకున్నారని, దాని గడువు ముగిసిపోయిందని వివరించారు. గడువు ముగిసన లేఖతో శ్రీవారి బ్రేక్ దర్శనానికి పంపించాలని పట్టుబట్టారని, అందుకు నిబంధనలు అంగీకరించబోవని ఆమెకు తెలియజేశామని చెప్పారు. వాటినేవీ వినిపించుకోకుండా బ్రేక్ దర్శనానికి పంపించాల్సిందేనంటూ పట్టుబట్టారని చెప్పారు.
𝗦𝗮𝘃𝗲 𝗧𝗶𝗿𝘂𝗺𝗮𝗹𝗮 𝗳𝗿𝗼𝗺 𝗝𝘂𝗻𝗴𝗹𝗲 𝗥𝗮𝗷 𝗶𝗻 𝗔𝗣! @narendramodi @AmitShah pic.twitter.com/8zlGxbzbCY
— iTDP Official (@iTDP_Official) September 5, 2022
ఇక్కడి నిబంధనలు, తాము అనుసరిస్తోన్న మార్గదర్శకాల గురించి వివరించడానికి ప్రయత్నించామని, అయినా పట్టించుకోలేదని అన్నారు. ఈ వీడియోను తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా విభాగం ఐటీడీపీ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. సేవ్ తిరుమల ఫ్రమ్ జంగిల్ రాజ్ ఇన్ ఏపీ అనే క్యాప్షన్‌ను జోడించింది. దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ట్యాగ్ చేసింది.












Click it and Unblock the Notifications