Tirumala: తిరుమలలో చిక్కిన మరో చిరుత.. ఊపిరి పీల్చుకుంటున్న భక్తులు..
తిరుమలకు నడకదారిన వెళ్లే భక్తులు చిరుత భయంతో వణికిపోతున్నారు. అయితే చిరుతలను పట్టుకునేందుకు టీటీడీ, అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. అటవీ శాఖ అధికారులు ఇప్పటికే మూడు చిరుతలు బంధించగా.. తాజాగా మరో చిరుతను బంధించారు. అలిపిరి కాలి నడక మార్గం ఏడో మైలు వద్ద అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. దీంతో నాలుగు చిరుతలను అటవీ శాఖ అధికారులు బంధించారు. చిరుత పట్టుకోవడం కోసం అటవీ శాఖ అధికారులు వారం రోజులు ప్రయత్నం చేస్తున్నారు.
ఈ చిరుత రోజూ బోను వద్దకు వచ్చి తిరిగి వెనుదిరిగుతున్నట్లు బోన్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో తెలిసింది. అయితే ఆదివారం ఆ చిరుత బోనులోకి రావడంతో చిక్కింది. ఈ చిరుత బంధించడంతో ఆపరేషన్ చిరుత ముగిసినట్లేనని అధికారులు చెబుతున్నారు. నడక మార్గంలోకి వచ్చే చిరుతలు ఇవేనని.. వీటిని పట్టుకోవడంతో భక్తులు ప్రశాంతంగా నడకమార్గంలో తిరుమలకు వెళ్లొచ్చని చెబుతున్నారు. నడక మార్గంలో కొద్ది నెలల క్రితం కౌశిక్ అనే బాలుడిపై చిరుత దాడి చేసింది.

ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత రక్షిత అనే పాపపై చిరుత దాడి చేసి చంపడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం అయింది. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనతో తిరుమలకు వెళ్లారు. మరోవైపు టీటీడీ కూడా రక్షణ చర్యలు చేపట్టింది. కొన్ని నిబంధనలు కూడా తీసుకొచ్చింది. చిన్న పిల్లల ఉన్నవారిని ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే అనుమతి ఉంటుందని ప్రకటించింది. ఘాట్ రోడ్డు లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 మాత్రమే ద్విచక్ర వాహనాలకు అనుమతి ఉంటుందని ప్రకటించింది.
మరోవైపు కాలి నడక తిరుమలకు వెళ్లే భక్తులకు కర్రలను కూడా అందించింది. పలు జాగ్రత్త చర్యలు తీసుకుంటూనే.. అటవీ శాఖ అధికారులతో కలిసి చిరుతలను బంధించే కార్యక్రమం చేపట్టింది.












Click it and Unblock the Notifications