టీటీడీకి బిగ్ రిలీఫ్- ఆంక్షలతో కరుణించిన కేంద్రం
న్యూఢిల్లీ/తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ జరిమానా విధించిన అనంతరం చెలరేగిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని కొంత వెనక్కి తగ్గింది. గడువు ముగిసిన విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) లైసెన్స్‌ను రెన్యూవల్ చేయడానికి అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ- కొన్ని కీలకమైన ఆంక్షలను మాత్రం కొనసాగించాలని నిర్ణయించింది.
ఎఫ్‌సీఆర్ఏ చట్టం కింద జారీ చేసిన లైసెన్స్‌ను టీటీడీ అధికారులు రెన్యువల్ చేసుకోలేదంటూ కేంద్ర ప్రభుత్వం భారీ జరిమానా విధించిన విషయం తెలిసిందే. దీని విలువ 10 కోట్ల రూపాయలు. ఇందులో మూడు కోట్ల రూపాయలను టీటీడీ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించారు కూడా. ఎఫ్‌సీఆర్‌ఏ కింద లైసెన్సు రెన్యువల్ చేసుకోని కారణంగా శ్రీవేంకటేశ్వర స్వామివారికి విదేశీ భక్తులు ఇచ్చే విరాళాలు, హుండీ కానుకల కింద చెల్లించిన కరెన్సీ 30 కోట్ల రూపాయల మొత్తం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని టీటీడీ ఖాతాలో డిపాజిట్ కాలేదు.

ఈ లైసెన్స్ రెన్యూవల్ చేయించుకుంటే ఉంటే తప్ప విదేశీ కరెన్సీని ఎస్బీఐలోని తమ అకౌంట్‌లో డిపాజిట్ చేసే వీలు టీటీడీకి లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం టీటీడీపై భారీ జరిమానా విధించింది. 2018లో లైసెన్స్ గడువు ముగిసింది. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని రెన్యూవల్ చేయించడానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వనూ లేదు. లైసెన్స్ గడువు ముగిసిందనే విషయాన్ని 2019లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గుర్తించింది. టీటీడీపై 10 కోట్ల రూపాయల మేర భారీ జరిమానా విధించింది.
2020లో టీటీడీ పాలక మండలి మూడు కోట్ల రూపాయలను పెనాల్టీ రూపంలో చెల్లించారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ ఈ ఉదంతాన్ని బయటపెట్టారు. హిందూయిజాన్ని అడ్డుగా పెట్టుకుని అడ్డగోలుగా కేంద్ర ప్రభుత్వం జరిమానాలను విధిస్తోందంటూ మండిపడ్డారు. దీనిపై అనేక విమర్శలు, ఆరోపణలు వ్యక్తం అయ్యాయి.
దీనితో కేంద్ర ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గింది. ఎఫ్‌సీఆర్ఏ లైసెన్స్‌ను రెన్యూవల్ చేయించుకోవడానికి టీటీడీకి అనుమతి ఇచ్చింది. అలాగే- ఇప్పుడు టీటీడీ వద్ద ఉన్న 30 కోట్ల రూపాయల విలువ చేసే విదేశీ కరెన్సీని ఎస్‌బీఐలో డిపాజిట్ చేయడానికీ అంగీకరించంది. అయినప్పటికీ- ఆంక్షలను మాత్రం కొనసాగించింది. విదేశాల నుంచి టీటీడీకి విరాళలను అందించే దాతలు, భక్తుల వివరాలను తమకు తెలియజేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఏ భక్తుడు విదేశీ కరెన్సీని హుండీలో వేశారనేది తమకు ఎలా తెలుస్తుందని టీటీడీ చెబుతోంది.












Click it and Unblock the Notifications