తిరుమలకు వెళ్లే భక్తుల కోసం అందుబాటులో మరో సౌకర్యం- టీటీడీ కీలక నిర్ణయం
శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు వెళ్లే భక్తుల కోసం మరో సౌకర్యం అందుబాటులోకి రానుంది. తిరుపతిలో నిర్మితమౌతోన్న శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ మే నాటికి ప్రారంభం కానుంది.
తిరుమల: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. కంపార్ట్ మెంట్లలో భక్తులు పెద్దగా వేచి ఉండాల్సిన అవసరం లేదు. సర్వదర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ దర్శనానికి నాలుగు, 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. మంగళవారం 59,751 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 24,177 మంది స్వామివారికి తలనీలాలను సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీ ద్వారా 3.80 కోట్ల రూపాయలు ఆదాయం లభించింది.

పరీక్షల వల్లే..
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు వార్షిక పరీక్షలకు సన్నద్ధమౌతోన్నారు. వేర్వేరు కాంపిటిటీవ్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్స్ వెలువడ్డాయి. ఈ షెడ్యూల్స్ అన్నీ ముగిసిన తరువాత తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు. వేసవి సెలవుల్లో శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, దీనికి అనుగుణంగా ముందస్తు చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

రద్దీ భారీగా..
వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు. గత ఏడాది వేసవి సీజన్ కంటే కూడా ఇప్పుడు వచ్చే భక్తులు రెట్టింపుగా వస్తారని భావిస్తోన్నారు. తిరుమలలో రద్దీని నియంత్రణకు ఇప్పటికే కొన్ని ప్రత్యేక చర్యలను తీసుకున్నారు. తాజాగా తిరుపతిలో వాహనాల రద్దీని నివారించడానికి తక్షణ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నారు.

రోజూ లక్షన్నర మంది..
ప్రతిరోజూ సగటున లక్షన్నర మంది వరకు భక్తులు తిరుపతికి వస్తుంటారు. వారి కోసం ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం శ్రీనివాస సేతు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద ఈ ఫ్లైఓవర్ మంజూరయింది. ఈ ఫ్లైఓవర్ మొత్తం నిర్మాణ వ్యయం 680 కోట్ల రూపాయలు. ప్రస్తుతం 90 శాతం వరకు నిర్మాణం పూర్తి చేసుకుంది. మిగిలిన పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోన్నారు అధికారులు.

మూడో దశలో..
శ్రీనివాస సేతు మూడవ దశలో నిర్మాణం పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. దాదాపు ఆరు స్టీల్ గర్డర్లను అమర్చాల్సి ఉంది. దీనికోసం టీటీడీ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుని ఏప్రిల్ 15వ తేదీ నాటికి ఈ ఆరు గర్డర్లను అమర్చేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. రామానుజ సర్కిల్ నుంచి రేణిగుంట వైపు, తిరుచానూరు మార్కెటింగ్ యార్డ్ వరకు ఉన్న శ్రీనివాస సేతు పనులను ఈ వేసవి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

మే 15వ తేదీ నాటికి..
శ్రీనివాస సేతు నిర్మాణ పనులు ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు కూడా మే 15వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉంటుందని టీటీడీ కార్యనిర్వాహణాధికారి ధర్మారెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలే ఆయన నిర్మాణ పనులను సమీక్షించారు. వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ ఆరంభం అయ్యే నాటికి ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుందని ఆయన అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.












Click it and Unblock the Notifications