పవన్ వల్ల చిరంజీవి కూడా బాధపడుతున్నాడు..!!
తిరుపతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇవ్వాళ తిరుపతిలో ప్రత్యక్షం అయ్యారు. భారీ కాన్వాయ్‌తో ఎంట్రీ ఇచ్చారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర నాయకులతో కలిసి విజయవాడ గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.
అనంతరం పవన్ కల్యాణ్.. ర్యాలీగా తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. జిల్లాలోని శ్రీకాళహస్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అంజు యాదవ్‌పై లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. శ్రీకాళహస్తికి చెందిన పార్టీ కార్యకర్త కొట్టె సాయిపై చేయి చేసుకున్న సీఐ అంజు యాదవ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

దీనిపై ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పవన్ కల్యాణ్‌పై ఘాటు విమర్శలు సంధించారు. సవాళ్లను విసిరారు. 20-30 స్థానాల్లో పోటీ చేసే పవన్ కల్యాణ్ ఎలా ముఖ్యమంత్రి కాగలడో తనకు ఇప్పటికీ అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు.
175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలిపి.. ఎన్నికలకు వెళ్లి, మెజారిటీ స్థానాలను గెలుచుకోగలిగితేనే ముఖ్యమంత్రి పదవి వరిస్తుందని నారాయణ స్వామి అన్నారు. తెలుగుదేశం పార్టీతో కలిసి జనసేన అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు ఇచ్చే నియోజకవర్గాల సంఖ్యను కొద్దో, గొప్పో పెంచుకోవడం కోసమే పవన్ కల్యాణ్ డ్రామాలు ఆడుతున్నాడని ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన నిజంగా పవన్ కల్యాణ్‌కు ఉంటే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలపాలని సవాల్ విసిరారు నారాయణ స్వామి. పాతిక సీట్లతో ఎలా ముఖ్యమంత్రి కాగలవు మహానుభావా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సింహంలాంటి నాయకులని, అలాంటి వారిని ఎదుర్కోగలవా? అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications