ఏపీకి ప్రధాని మోదీ..!!
తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్- మిషన్ చంద్రయాన్ 3. చంద్రుడిపై మరిన్ని పరిశోధనలను సాగించడానికి చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 విఫలమైన అనంతరం దీనికి శ్రీకారం చుట్టింది ఇస్రో. చంద్రయాన్ 2 చేదు అనుభవాలను మిగిల్చిన నేపథ్యంలో అవి పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది.
ఈ నెల 14వ తేదీన చంద్రయాన్ స్పేస్ క్రాఫ్ట్‌ను ప్రయోగించనుంది ఇస్రో. మధ్యాహ్నం 2:35 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్తుందీ రాకెట్. దీనికి సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే చంద్రాయన్ స్పేస్ క్రాఫ్ట్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్‌కు చేరుకుంది. దీన్ని జియోసింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ మార్క్-3తో అనుసంధానించింది.

ఈ స్పేస్ క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి మోసుకెళ్లేది ఈ రాకెట్టే. ప్రయోగించిన తేదీ నుంచి 40 రోజుల పాటు అంతరిక్ష ప్రయాణాన్ని కొనసాగిస్తుంది ఈ రాకెట్. ఆగస్టు 23 లేదా 24వ తేదీన చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయ్యేలా ఇస్రో ప్రణాళికలను వేసుకుంది. రోవర్‌ను చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ చేయాలనేదే ఇస్రో ప్రయత్నం.
ఈ ప్రయోగానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమ్‌నాథ్ వెల్లడించారు. చారిత్రాత్మక ఘటన కావడం వల్ల చంద్రయాన్ 3 ప్రయోగానికి హాజరు కావాలంటూ తాము కేంద్ర ప్రభుత్వంతో పాటు, కొందరు ప్రముఖులను ఆహ్వానించామని అన్నారు. మోదీ రాకపై ప్రధానమంత్రి కార్యాలయం తుది నిర్ణయాన్నితీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

2019లో జరిగిన చంద్రయాన్ మిషన్ ల్యాండింగ్ ప్రక్రియను పర్యవేక్షించడానికి ప్రధాని మోదీ శ్రీహరికోటకు వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ ప్రయోగం విఫలమైంది. చంద్రుడిపై ల్యాండ్ అయ్యే చివరి నిమిషంలో రోవర్ గతి తప్పింది. దాన్ని వేగాన్ని నియంత్రించే విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలు సక్సెస్ కాలేకపోయారు.
ఫలితంగా చంద్రుడి ఉపరితలంపై రోవర్ క్రాష్ ల్యాండింగ్ అయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ మిషన్ విఫలం కావడం దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. అప్పటి ఇస్రో ఛైర్మన్ శివన్ కన్నీరు మున్నీరయ్యారు. ఆయనను మోదీ అక్కున చేర్చుకుని ఓదార్చిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications