తిరుమలలో బ్రహ్మోత్సవాల శోభ- వైభవంగా అంకురార్పణ: ఈ సారి ప్రత్యేకత ఇదే..!!
తిరుపతి: కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేడు ఆరంభం కానున్నాయి. అక్టోబర్ 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అంగరంగ వైభవంగా జరుగనున్న ఈ బ్రహ్మోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు.
అంకురార్పణ సందర్భంగా సేనాధిపతి విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. బ్రహ్మోత్సవ రోజుల్లో శ్రీవారిని దర్శించడానికి రోజూ లక్షమంది వరకు భక్తులు తిరుమలకు వస్తారని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు.

భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీవారి దర్శనాన్ని కల్పించడంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు టీటీడీ అధికారులు. అందుకే సర్వదర్శన టోకెన్ల సంఖ్యను పెంచారు. కాలినడకన వచ్చే వారు నేరుగా శ్రీవారి దర్శనం చూసుకునేలా చర్యలు తీసుకున్నారు. చాలినన్ని లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేశారు. ప్రతిరోజూ లక్షకు పైగా లడ్లను విక్రయించనున్నారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ, ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తిరుమల నాదనీరాజనం వేదికపై ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తొమ్మిది రోజుల పాటు తెల్లవారు జామున 5 నుంచి 5:45 నిమిషాల వరకు వేద విద్యార్థులు చతుర్వేదాలతో వేదఘోష వినిపిస్తారు. 5:45 నుంచి 6:45 నిమిషాల వరకు దేశంలోని ప్రముఖ పండితులతో వేద విజ్ఞానంపై సదస్సు నిర్వహిస్తారు. వేదఘోష కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ సారి బ్రహ్మోత్సవాల ప్రత్యేకత.

ఇందులో భాగంగా చిర్రావూరి శ్రీరామశర్మ, వెంపటి కుటుంబ శాస్త్రి, డాక్టర్ అల్లాడి మోహన్, చక్రవర్తి రంగనాథన్, రాణి సదాశివ మూర్తి, దేవనాథన్, కృష్ణమూర్తి వంటి వేద శాస్త్రజ్ఞులు పంచదశ సంస్కారాలు, కఠోపనిషద్, ఆధునిక శాస్త్రాలలో వేదాల ప్రాముఖ్యత తదితర అంశాలపై ఉపన్యసించనున్నారు.
ప్రతి రోజు సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు ప్రముఖ గాయకులు ఫణినారాయణ, నేమాని పార్థసారధి, డాక్టర్ మోహన్ కృష్ణ, శ్రీనిధి, పవన్ కుమార్ చరణ్, ప్రొఫెసర్ శైలేశ్వరి, రాణి శ్రీనివాస శర్మ, వాసురావు, మొదుముడి సుధాకర్, శ్రీరామాచారి తమ బృందాలతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications