తిరుమల శ్రీవారి లడ్డూ కౌంటర్‌లో అనూహ్య ఘటన- టీటీడీ కంప్లైంట్
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉంటోన్నారు. స్వామివారి దర్శనానికి 5 నుంచి 7 గంటల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. సోమవారం శ్రీవారిని 70,413 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 32,206 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని, తమ మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ ద్వారా 3.37 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ సంచరించిన వ్యవహారం వల్ల చెలరేగిన ప్రకంపనలు ఇంకా తగ్గట్లేదు. తిరుమల డ్రోన్ విజువల్స్ కు సంబంధించి వివాదం దుమారం రేపుతోంది. దీనిపై ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. పోలీసుల దృష్టికీ తీసుకెళ్లారు. పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తోన్నారు. దీన్ని చిత్రీకరించిన ఐఓసీ సిబ్బందిపై కేసు నమోదు చేశారు.

డ్రోన్‌తో శ్రీవారి ఆలయం చిత్రీకరణకు సంబంధించిన వీడియోలన్నింటినీ యూట్యూబ్ నుంచి తొలగించారు. అదే సమయంలో తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టమ్ తీసుకొని రానున్నట్లు వెల్లడించారు. ఈ వివాదం ఇలా కొనసాగుతున్న పరిస్థితుల్లోనే- మరో ఉదంతం చోటు చేసుకుంది. తాజాగా తిరుమల లడ్డూ కౌంటర్ లో చోరీ జరిగింది. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా- ఆలస్యంగా ఇది వెలుగులోకి వచ్చింది.
తిరుమలో గల 36వ శ్రీవారి లడ్డూ కౌంటర్ లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు టీటీడీ అధికారులు నిర్ధారించారు. కౌంటర్ బాయ్ నిద్రపోతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి రెండు లక్షల రూపాయలను చోరి చేసినట్లు గుర్తించారు. దీనిపై అధికారులు తిరుపతి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. లడ్డూ కౌంటర్ సహా పరిసర ప్రాంతాల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీల ద్వారా నిందితుడిని గుర్తించారు.