tirupati by poll bjp somu veerraju pawan kalyan jana sena adinarayana reddy తిరుపతి ఉపఎన్నిక బీజేపీ సోము వీర్రాజు పవన్ కల్యాణ్ జనసేన ఆదినారాయణ రెడ్డి politics
తిరుపతి పోరు: బీజేపీ సంచలనం -జనసేనకు విడిగా సొంత కమిటీ -దాసరికి చోటు -టికెట్ రత్నప్రభకే!
ప్రతిష్టాత్మక తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు సంబంధించి భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. సొంతగా ప్రచార కమిటీని ప్రకటించింది. పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలోని జనసేన పార్టీతో పొత్తు ఉన్నప్పటికీ బీజేపీ సొంతగా కమిటీని ప్రకటించడం చర్చనీయాంశమైంది. అదే సమయంలో అభ్యర్థి ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతుండగా, రేసులో ఉన్న ఇద్దరు కీలక నేతలకు వేరే బాధ్యతలు కట్టబెట్టడం ద్వారా టికెట్ రత్నప్రభకే దక్కబోతోందనే సంకేతాలిచ్చింది. వివరాల్లోకి వెళితే..
షాకింగ్: తీన్మార్ మల్లన్న ఓటమిని తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య -పార్టీలే సూసైడ్ చేసుకోవాలంటూ

వలస నేతలకే బాధ్యతలు
ఏపీలో ఇటీవల ముగిసిన పంచాయితీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపకున్నా, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో సత్తా చాటుతామంటోన్న బీజేపీ.. ఆ మేరకు ప్రచార కమిటీని ప్రకటించింది. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆదివారం మీడియాతో ఈ మేరకు ఎవరెవరికి బాధ్యతలు ఇచ్చారో చెప్పుకొచ్చారు. బీజేపీ ప్రకటించిన తిరుపతి ఎన్నికల కమిటీలో ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉన్న నేతల కంటే ఇటీవల కాలంలో ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకే ప్రాధాన్యం ఇచ్చారు. తిరుపతి పార్లమెంట్ సెంగ్మెంట్ లోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగానూ బాధ్యులను ప్రకటించారు. అందులో..

కన్వీనర్‌గా ఆదినారాయణ రెడ్డి
తిరుపతి బైఎలక్షన్ కోసం బీజేపీ ప్రకటించిన ప్రచార కమిటీకి మాజీ మంత్రి, కడప జిల్లాకు చెందిన ఆదినారాయణరెడ్డి కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ప్రచార కమిటీ సభ్యులుగా ఎంపీలు టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి, సీఎం రమేశ్, జీవీఎల్ నరసింహారావు, పార్టీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, శాంతారెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఐవైఆర్ కృష్ణారావు, దాసరి శ్రీనివాసులు, రావెల కిశోర్ బాబు, వాకాటి నారాయణరెడ్డి, చంద్రమౌళి, సుధీశ్ రాంభొట్లను నియమించారు. ఇక, పురందేశ్వరి, సత్యకుమార్ లను ప్రత్యేక ఆహ్వానితులుగా పేర్కొనగా, ప్రచార కమిటీకి ఎక్స్ అఫిషియో ఆహ్వానితులుగా కేంద్ర మంత్రి మురళీధరన్, బీజేపీ ఏపీ ఇంచార్జి సునీల్ దేవధర్, ఏపీ చీఫ్ సోము వీర్రాజు, నూకల మధుకర్, పీవీఎన్ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, సూర్యనారాయణరాజు, లోకుల గాంధీ పేర్లను ప్రకటించారు. అదే సమయంలో...

బీజేపీ 7X2 ఫార్ములా
తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రచార బాధ్యతను అప్పగించే విషయంలో బీజేపీ సైతం వైసీపీ అధినేత, సీఎం జగన్ ఫార్ములాను ఫాలో అయింది. వైసీపీ ఒక్కో అసెంబ్లీలో ఒక్కో మంత్రి ప్లస్ ఒక్కో ముఖ్యనేతకు బాధ్యతలు ఇవ్వగా, బీజేపీ మాత్రం పార్టీ ఇంచార్జి ప్లస్ ప్రముఖ్ పేరుతో ఇద్దరిద్దరిని నియమించింది.
సర్వేపల్లి అసెంబ్లీ స్థానం ఇన్చార్జిగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ప్రముఖ్ గా సురేశ్ రెడ్డి వ్యవహరిస్తారు. అలాగే గూడూరుకు ఇంచార్జి పసుపులేటి సుధాకర్ రెడ్డి, ప్రముఖ్ గా చిరంజీవి రెడ్డి ఉంటారు. వెంకటగిరిలో సూర్యనారాయణ(ఇంచార్జి), నాగోతు రమేశ్ నాయుడు(ప్రముఖ్), సూళ్లూరుపేటలో ఇంచార్జి వాకాటి నారాయణరెడ్డి, సురేంద్ర రెడ్డి(ప్రముఖ్), సత్యవేడులో ఇంచార్జి చిన్నం రామకోటయ్య, కునిగిరి నీలకంఠ(ప్రముఖ్), శ్రీకాళహస్తిలో ఇంచార్జి సైకం జయచంద్రారెడ్డి, ప్రముఖ్ రమేశ్ రాయుడు, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జిగా డాక్టర్ పార్థసారథి, ప్రముఖ్ గా బుచ్చి రాజుల పేర్లను బీజేపీ ప్రకటించింది. కాగా,

జనసేన ఒంటరి పోరు.. సోము క్లారిటీ
గడిచిన రెండేళ్లుగా కలిసుంటోన్న జనసేన, బీజేపీల మధ్య ఇటీవల విభేదాలు పెరగడం, తెలంగాణలో బీజేపీకి తెగదెంపులు పలికిన పవన్ కల్యాణ్.. టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి మద్దతు పలకడం, ఏపీలోనూ బీజేపీతో పొత్తు వల్ల చాలా నష్టపోయామని జనసేన కీలక నేతలు వ్యాఖ్యానించడం, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు జనసేన సొంతగానే కమిటీని ప్రకటించిన దరిమిలా తిరుపతిలో ఆ రెండు పార్టీల పొత్తుపై సందిగ్ధం ఏర్పడింది.
అయితే, సొంతగా బీజేపీ కమిటీని ప్రకటిస్తూనే, పవన్ తో పొత్తుపై సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు. తిరుపతిలో అభ్యర్థి ఎవరేది బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ త్వరలోనే నిర్ణయిస్తుందని, ఆ తర్వాత జనసేనతో కలిసి సమన్వయ కమిటీలను ప్రకటిస్తామని సోము వీర్రాజు పేర్కొన్నారు. నాగార్జున సాగర్ లో సొంతగా కమిటీని ప్రకటించిన జనసేన.. తిరుపతిలో మాత్రం ఆపనిచేయకుండా పొత్తు ధర్మాన్ని పాటిస్తే, బీజేపీ మాత్రం సొంతగా కమిటీని ప్రకటించేయడం చర్చనీయాంశమైంది. పనిలో పనిగా..

రత్నప్రభకే టికెట్.. దాసరికి మరో బాధ్యత
తిరుపతి ఉప ఎన్నిక అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి బీజేపీ అభ్యర్థి ఎవరేది ఉత్కంఠగా మారింది. రేసులో మాజీ ఐఏఎస్ అధికారులైన రత్నప్రభ, దాసరి శ్రీనివాసులు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుల పేర్లు ప్రధానంగా వినిపించాయి. రత్నప్రభ లేదా దాసరి శ్రీనివాసులులో ఒకరికి టికెట్ ఖాయమని గత వారం వార్తలు వచ్చాయి.
అయితే, ఆదివారంనాడు ప్రకటించిన ప్రచారక కమిటీలో దాసరి శ్రీనివాసులు పేరు ఉండటంతో ఆయనకు అభ్యర్థిత్వం దక్కలేదని పరోక్షంగా వెల్లడైంది. ప్రచార కమిటీ సభ్యులుగా దాసరి శ్రీనివాసులుతోపాటు రావెల కిషోర్ బాబు పేరు కూడా ఉంది. దీంతో ఇప్పుడు రేసులో రత్నప్రభ ఒక్కరే నిలిచినట్లయింది. అభ్యర్థి ఎవరనేది బీజేపీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అధికార వైసీపీ తరఫున జగన్ వ్యక్తిగత ఫిజియోగా పనిచేసిన డాక్టర్ గురుమూర్తి, టీడీపీ తరఫున కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి బరిలో ఉన్నారు. ఏప్రిల్ 17న తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది.