ఒక్కరోజు తేడాతో తిరుమలకు వైఎస్ జగన్.. చంద్రబాబు: సపరివార సమేతంగా టీడీపీ చీఫ్..కారణం?
తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.. ఈ నెల 21వ తేదీన తిరుమలకు బయలుదేరి వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం- తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమాలను ఆయన లాంఛనంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం మార్చి 21వ తేదీన ఆయన సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీనికి కారణం- తన మనవడు, మాజీమంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ పుట్టిన రోజు కావడమే.
దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదానం ట్రస్ట్‌కు 30 లక్షల రూపాయలను విరాళంగా అందజేస్తారు. ఒకరోజు అన్న ప్రసాదం వితరణకు అయ్యే ఖర్చును చంద్రబాబు కుటుంబం భరిస్తుంది. శ్రీవారి దర్శనానంతరం చంద్రబాబు.. తిరుపతిలో పార్టీ నేతలతో సమావేశమౌతారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమాలను సమీక్షిస్తారు. పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తారు. పార్టీ అభ్యర్థిని పనబాక లక్ష్మి, లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు, చిత్తూరు, నెల్లూరు జిల్లా నాయకులు ఇందులో పాల్గొంటారని తెలుస్తోంది.

అమరావతి భూ కుంభకోణం వ్యవహారంలో అనూహ్య పరిస్థితుల మధ్య ఏపీ సీఐడీ నుంచి నోటీసులను అందుకున్న చంద్రబాబు.. ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాల్సి ఉంది. దానికి రెండు రోజుల ముందే శ్రీవారిని దర్శించుకోనున్నారు. సీఐడీ విచారణను నిలిపివేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటీషన్‌పై.. కాస్సేపట్లో న్యాయమూర్తులు విచారణ చేపట్టనున్నారు.
కాగా- ఆ మరుసటి రోజే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తిరుమలను సందర్శించే అవకాశం ఉంది. నిజానికి్- ఈ నెల 16వ తేదీ నాడే ఆయన తిరుమలకు వెళ్లాల్సి ఉండగా.. వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ఈ నెల 22వ తేదీకి వాయిదా పడినట్లు సమాచారం. తిరుమలలో ఆధునికీకరించిన శ్రీవారి పోటును లాంఛనంగా ప్రారంభించడాన్ని 22వ తేదీన చేపట్టే అవకాశం ఉంది. 2018లో శ్రీవారి పోటులో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం దాన్ని టీటీడీ అధికారులు ఆధునికీకరించారు. శ్రీవారి పోటును విస్తరించారు. వాటిని వైఎస్ జగన్ ప్రారంభించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications