శ్రీవారికి బంగారు శంకుచక్రాలు: విలువెంతో తెలుసా? పండుగ రోజుల్లో సర్వాంగసుందరంగా
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తమిళనాడుకు చెందిన భక్తొడకరు బంగారుతో తయారు చేసిన శంఖు చక్రాలను బహూకరించారు. నాణ్యమైన బంగారంతో చేసిన శంఖుచక్రాలవి. వాటి విలువ రెండు కోట్ల రూపాయలకు పైమాటే. వాటి బరువు మూడున్నర కేజీలు. ఈ ఉదయం ఆయన వాటిని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందజేశారు. ఆ భక్తుడి పేరు తంగదొరై. తమిళనాడులోని థేనికి చెందిన ఆయన శ్రీవారి భక్తుడు.
ఈ తెల్లవారు జామున శ్రీవారికి ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం శంఖుచక్రాలను తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎంవీ ధర్మారెడ్డికి అందజేశారు. శ్రీవారి ఆలయంలో వాటికి ప్రత్యేక పూజలను నిర్వహించారు.

తంగదొరైకి శాలువా కప్పి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పండుగ రోజులు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో వాటిని శ్రీవారి విగ్రహానికి అలంకరిస్తామని తెలిపారు. తంగదొరై.. ఇదివరకు కూడా వేంకటేశ్వర స్వామివారికి పెద్దఎత్తున బంగారు ఆభరణలను కానుకగా సమర్పించారు. బంగారు కటి, వరద హస్తాలు, వడ్డాణం, వజ్రాభరణాలు విరాళంగా అందజేశారు.

శంకుచక్రాలు, ఇతర బంగారు ఆభరణాలను తయారు చేయించడానికి మూడు నెలల సమయం పట్టిందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. నాణ్యమైన బంగారంతో వాటిని తయారు చేయించారని చెప్పారు. ఈ ఉదయం ఆయన శంకుచక్రాలను ఉంచిన పెట్టెను తలపై మోస్తూ శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ పెట్టేను కొద్దిసేపు స్వామివారి పాదాల వద్ద ఉంచి, పూజలను నిర్వహించారు అర్చకులు. అనంతరం ఆలయం ఆవరణలోని రంగనాయకుల మండపంలో వాటిని టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డికి అందజేశారు.












Click it and Unblock the Notifications