శ్రీవారి దర్శనం టికెట్ల కోటా కుదింపు: టీటీడీ కీలక ప్రకటన
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం నాడు 69,029 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 28,547 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 2.90 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్‌లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు. మున్ముందు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు.

భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతున్నందున టీటీడీ అధికారులు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటోన్నారు. శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించే విషయంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. సామాన్య భక్తులకు అనుకూలమైన నిర్ణయం అది.
ఈ క్రమంలో శ్రీవాణి ట్రస్ట్ కింద జారీ చేసే టికెట్ల సంఖ్యను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆఫ్‌లైన్‌లో రోజూ 1,000 టికెట్లను జారీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో 100 టికెట్లు మాత్రమే విమానాశ్రయంలో అందజేస్తారు. మరో 900 టికెట్లను తిరుమలలో గల గోకులం అతిథి గృహంలో జారీ చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
ఆన్‌లైన్‌లో జారీ చేసే రోజూ 500 కోటా టికెట్లలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. అవి యధాతథంగా కొనసాగుతాయి. ఈ విధానం ఈ నెల 22వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. తిరుమలలో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని, భక్తులు సహకరించాలని కోరారు.












Click it and Unblock the Notifications