శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్: ఆరు నెలల్లో ఎప్పుడైనా తిరుమలకు: ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్
తిరుపతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కురిసిన అతి భారీ వర్షాల ధాటికి విలవిల్లాడిపోయాయి. వర్షాలు తగ్గినా.. ఇప్పటికీ తేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. నదులు ఎన్నడూ లేనంతగా ఉప్పొంగాయి. ఉగ్ర రూపాన్ని దాల్చాయి. లోతట్టు ప్రాంతాలు ఇంకా వరదనీటిలోనే నానుతున్నాయి. రోడ్లు కోసుకుపోయాయి. రైలు పట్టాలు కొట్టుకుపోయాయి. పలు నివాసాలు ధ్వంసం అయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది హెక్టార్లలో పంట నీట మునిగింది.
టెంపుల్ సిటీగా పేరు పొందిన తిరుపతి మరింత దెబ్బతింది. తిరుమలగిరుల నుంచి ఉధృతంగా ఉరకలు వేసిన గంగమ్మ తిరుపతిని ముంచెత్తింది. కపిలతీర్థం, మాల్వాడిగుండం, పాపనాశనం.. ఇవన్నీ గరిష్ఠ స్థాయి నీటి మట్టాన్ని అధిగమించాయి. తిరుమల గిరులు జలపాతాలకు నిలయం అయ్యాయి. తిరుపతి మొత్తం సగానికి మునిగిపోయింది. తిరుపతికి దారి తీసే రైలు మార్గాలు పలు చోట్ల కొట్టుకునిపోయాయి. రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి.

తిరుమలలో పోటెత్తిన వరద కారణంగా బండరాళ్లు కొట్టుకుని రావడం వల్ల తిరుమల అలిపిరి మెట్ల మార్గం కూడా ధ్వంసమైంది. ఘాట్ రోడ్లు ప్రమాదకరంగా మారాయి. కొండ చరియలు విరిగి పడకుండా ముందుజాగ్రత్తగా కట్టిన రిటైనింగ్ వాల్స్ ఈ వర్షాల ధాటికి నిలవలేకపోయాయి. పలుచోట్ల రోడ్లకు అడ్డుగా పడ్డాయి. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. వాటిని పునరుద్ధరించడానికి టీటీడీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. మరమ్మతులు చేస్తోన్నారు.
ఈ ప్రకృతి విపత్తు కారణంగా శ్రీవారిని దర్శించుకోవడానికి రాలేకపోయారు వేలాదిమంది భక్తులు. తిరుమలేశుడి దర్శనం కోసం టికెట్లను అడ్వాన్స్డ్‌గా బుక్ చేసుకున్న భక్తులకు సకాలంలో స్వామివారి దర్శనానికి వెళ్లలేకపోయారు. అలాంటి వారి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శుభవార్త వినిపించారు. ఈ నెల 18 నుంచి 30వ తేదీ మధ్యకాలంలో శ్రీవారి దర్శనం కోసం ముందస్తుగా టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు మరో అవకాశం ఇచ్చారు.
వారు బుక్ చేసుకున్న టికెట్ల గడువును ఆరు నెలలకు పొడిగించారు. ఈ నెల 18 నుంచి 30 మధ్యలో టికెట్ బుక్ చేసుకున్న తేదీ నుంచి ఆరునెలల పాటు ఈ గడువు అందుబాటులో ఉంటుంది. ఈ ఆరునెలల కాలంలో భక్తులు ఎప్పుడైనా సరే.. శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు వెళ్లొచ్చు. దీనికి అనుగుణంగా టీటీడీ అధికారులు ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోన్నారు. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా భక్తులు తాము ముందుగా రిజర్వ్ చేసుకున్న టికెట్లను అప్‌డేట్ చేసుకోవడానికి వీలు ఉంటుంది.












Click it and Unblock the Notifications